కులాంతర పెళ్లిళ్ల కోసం సీఎంలందరికీ లేఖలు: కేంద్రమంత్రి

10 Jul, 2017 10:40 IST|Sakshi
కులాంతర పెళ్లిళ్ల కోసం సీఎంలందరికీ లేఖలు: కేంద్రమంత్రి

లక్నో: కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా సమాజం మొత్తం కలిసుండేలా చేయొచ్చని కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని అన్నారు. ఇటీవల కాలంలో దళితులపై దాడులు పెరుగుతుండటం, కులపరమైన ఘర్షణలు పెరుగుతుండటం నేపథ్యంలో స్పందించిన ఆయన దళితులపై దాడులు తగ్గించేందుకు కులాంతర వివాహాలే పరిష్కారం అన్నారు. ఈ విషయంలో తాను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తానని చెప్పారు. ఆదివారం ఆయన గుర్గావ్‌లో మీడియాతో మాట్లాడుతూ దళితులపై నానాటికి దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

దీనికి పరిష్కారం కులాంతర వివాహాలే అని చెప్పారు. 'దళితులపై దాడులు తగ్గించేందుకు కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్‌లో రూ.25కోట్లు కేటాయించాలని కోరుతున్నాను. అలాగే, ఇంటర్‌ క్యాస్ట్‌ మేరేజ్‌ చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వాలు రూ.5లక్షల ఆర్థిక సహాయంతో అందజేయడంతోపాటు ఆ ఇద్దరిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. దీని ద్వారా కులాల పేరిట పెరుగుతున్న అంతరాలకు బదులు కలిసే ఉంటారు' అని చెప్పారు. దళితులపై దాడులు ఎక్కువగా బిహార్‌, రాజస్థాన్‌లో జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రెండున్నర లక్షల ఆర్థిక సహాయం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రూ.50 వేల నుంచి రెండు లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు