కరోనా కట్టడి చర్యలపై ఐఎంసీటీ సంతృప్తి 

1 May, 2020 02:16 IST|Sakshi

కేంద్ర హోం శాఖ వెల్లడి

ఇటీవలే హైదరాబాద్‌లో పర్యటించిన ఐఎంసీటీ 

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీమ్‌ (ఐఎంసీటీ) ఇక్కడి కట్టడి చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ పేర్కొన్నారు. గురువారం కరోనా తాజాస్థితి వివరాలు తెలిపారు. ఇందులో భా గంగా హైదరాబాద్‌లో క్షేత్రస్థాయి పర్యటన వివరాలు వెల్లడించారు. ‘ఐఎంసీటీ బృందం ఆస్పత్రులు, సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్, మార్కెట్లను సందర్శించింది. టెస్ట్‌ కిట్లు, పీపీఈ కిట్లు తగినన్ని ఉన్నాయని ఈ బృందం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన డాష్‌ బోర్డు ద్వారా పేషెంట్ల రాక నుంచి డిశ్చార్జి వరకు పర్యవేక్షిస్తోందని తెలిపింది. స్టేట్‌ నోడల్‌ సెంటర్‌గా ఉన్న గాంధీ ఆస్పత్రిని కూడా కేంద్ర బృందం సందర్శించింది. రోజుకు 300 టెస్టులు జరిపే సామర్థ్యం ఈ ఆస్పత్రి లేబొరేటరీకి ఉంది. చికిత్స అందిన తర్వాత పేషెంట్‌ను ఇంటి వద్దకు వాహనంలో పంపిస్తోంది. 14 రోజుల పాటు మొబైల్‌ ద్వారా వారిని పర్యవేక్షిస్తున్నారు.

కింగ్‌కోఠి ఆస్పత్రిలో కూడా అన్నిరకాల ప్రామాణిక నిబంధనలు పాటిస్తున్నారు. శాంపిల్‌ సేకరణ వసతి ఉంది. ఆస్పత్రిలో పీపీఈ కిట్ల డానింగ్, డాఫింగ్‌ ఏరియాలను వేర్వేరుగా దూరంగా ఉంచాలని బృందం ఆస్పత్రికి సూచించింది. పేషెంట్లకు, సిబ్బం దికి వేర్వేరు కారిడార్లు కేటాయించాలని సూచించింది. హుమాయున్‌నగర్‌ కంటైన్మెంట్‌ కేంద్రాన్ని కూడా టీం పరిశీలించింది. క్వారంటైన్‌ కేంద్రాన్ని, సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ను కూడా సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసింది. రియల్‌ టైం మానిటరింగ్‌ ద్వారా ఔషధాల సరఫరా పర్యవేక్షణ ఉన్నట్లు బృందం గ్రహించింది.

షెల్టర్‌ హోంను కూడా సందర్శించి, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. మొబైల్‌ క్యాంటీన్లు, నైట్‌ షెల్టర్లు, అనాథాశ్రమాల ద్వారా భోజన వసతి ఏర్పాట్లు, లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు, సామాజిక దూరం పాటించడంపై సంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని భవన నిర్మాణాల వద్ద కార్మికులు మాస్కుల్లేకుండా పనిచేయడం చూసి దానిపై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు సూచించింది’అని శ్రీవాస్తవ వివరించారు. కాగా, తెలంగాణలో కేసుల రెట్టింపు రేటు 40 రోజులకు పైగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ సంయుక్త శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు