వాడుకలో లేని పీఎఫ్ ఖాతాలకూ వడ్డీ

30 Mar, 2016 09:27 IST|Sakshi
వాడుకలో లేని పీఎఫ్ ఖాతాలకూ వడ్డీ

 ఏప్రిల్ 1 నుంచి అమలు
 

 న్యూఢిల్లీ: వాడుకలో లేని (ఇనాపరేటివ్) ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాల్లోనూ ఏప్రిల్ 1 నుంచి వడ్డీ జమచేయాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించింది. ఇది దాదాపు రూ. 32వేల కోట్ల మేర డి పాజిట్లున్న సుమారు 9 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చనుంది. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సారథ్యంలోని ఈపీఎఫ్‌వో ట్రస్టీల బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం వాడుకలో లేని ఖాతాలకు వడ్డీ చెల్లింపులను నిలిపివేసిందని, తాము ఉద్యోగులకు అనుకూల నిర్ణయం తీసుకున్నామని దత్తాత్రేయ తెలిపారు. ఇకపై వాడుకలో లేని ఖాతాలంటూ ఉండబోవన్నారు.

36 నెలల పాటు చందాలు జమ కాని ఖాతాలను ఇనాపరేటివ్ ఖాతాలుగా వ్యవహరిస్తున్నారు. వడ్డీ ఆశతో ఖాతాల నుంచి డబ్బు తీసుకోకుండా, ఎటువంటి లావాదేవీలు జరపకుండా ఉండటాన్ని అరికట్టే ఉద్దేశంతో యూపీ ఏ ప్రభుత్వం ఇనాపరేటివ్ ఖాతాలపై వడ్డీ ఇవ్వరాదని నిర్ణయిం చింది. తదనుగుణంగా 2011 ఏప్రిల్ 1 నుంచి ఇటువంటి వాటికి వడ్డీ చెల్లింపులు నిల్చిపోయాయి. పీఎఫ్ డిపాజిట్లపై ఈ ఆర్థిక సంవత్సరం 8.8 శాతం వడ్డీ రేటు ఇచ్చే ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపినట్లు దత్తాత్రేయ తెలిపారు.

మరిన్ని వార్తలు