త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు

3 Jul, 2020 04:41 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అమెరికా, కెనడా, పలు యూరోప్, గల్ఫ్‌ దేశాలతో చర్చలు ప్రారంభించింది. ఆయా దేశాలతో విమాన సర్వీసుల అనుమతులకు సంబంధించి వేర్వేరుగా ప్రత్యేక ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకునే దిశగా చర్చలు జరుపుతోంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఆయా దేశాలకు చెందిన అనుమతించిన విమాన సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ దిశగా అమెరికా, కెనడాలతో చర్చలు పురోగతి సాధించినట్లు పౌర విమానయాన శాఖ ద్వారా తనకు సమాచారం అందిందని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ అరవింద్‌ సింగ్‌ వెల్లడించారు. యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకునే విషయమై ఆలోచిస్తున్నామని పౌర విమానయాన శాఖ జూన్‌ 23వ తేదీననే ప్రకటించింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలనే విషయంలో దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉందని అరవింద్‌ సింగ్‌ గురువారం జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్వహించిన ఒక వెబినార్‌లో తెలిపారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే ఉద్దేశంతో మార్చ్‌ 23 నుంచి అన్ని అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు