'న్యాయ వ్యవస్థతోనే అన్ని సమస్యలు పరిష్కారం'

22 Feb, 2020 12:30 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : రెండు రోజల పాటు ఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ న్యాయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, నిరంతర అధ్యయనంతోనే కొత్త విషయాలు తెలుసుకోవచ్చన్నారు. న్యాయవ్యవస్థ ద్వారానే సమస్యలు సులభంగా పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయని తెలిపారు. నేడు 130 కోట్ల మంది భారతీయులు తమ సమస్యలను న్యాయవ్యవస్థల ద్వారానే పరిష్కరించుకుంటున్నారని వెల్లడించారు. ఇటీవలే న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు ‍ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించిదన్నారు. ఈ సందర్భంగా తలాక్‌, మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవులు,దివ్యాంగ హక్కులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అందరూ ప్రశంసించారన్నారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు న్యాయ వ్యవస్థ సముచిత న్యాయం కల్పించిదని కొనియాడారు. (కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది: ఉద్ధవ్‌ ఠాక్రే)


ప్రస్తుతం డేటా భద్రత, సైబర్‌ క్రైమ్‌ వంటి నేరాలు పెరిగిపోతూ న్యాయవ్యవస్థకు సవాలుగా నిలిచిందని పేర్కొన్నారు. వీటిని పరిష్కరించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఉగ్రవాదం, సైబర్‌ క్రైహ్‌ అనేవి ప్రస్తుతం ప్రధాన సమస్యలుగా ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కొత్త ఆలోచనలతో న్యాయ వ్యవస్థ ముందుకు రావాలని, సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి పని చేస్తే బాగుంటుందని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే, ఇతర కేంద్ర మంత్రులు,పలువురు సుప్రీంకోర్టు జడ్జిలు, న్యాయవాదులు, వివిధ దేశాల న్యాయనిపుణులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు