ఆశ, శ్వాస.. యువ భారతమే

27 Jan, 2019 01:24 IST|Sakshi

ఒక దేశ ఆర్థికాభివృద్ధికి.. ఆ దేశంలోని కార్మిక శక్తి అత్యంత కీలకం. సహజ వనరులు ఎన్నున్నా.. భారీగా పెట్టుబడులు, అద్భుతమైన విధానాలు, సాంకేతికత అందుబాటులో ఉన్నా వీటికి పనిచేసే చేతులు తోడైతేనే సమాజానికి సంపద అందుతుంది. మానవాభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే.. అన్ని హంగులు, సామర్థ్యాలున్నా ప్రపంచంలోని చాలా దేశాల్లో పనిచేసేందుకు అవసరమైన కార్మికశక్తి లేకపోవడం ఆ దేశాలను కలవరపెడుతోంది. జనన రేటు తగ్గుదల కారణంగా జనాభా పెరుగుదల రేటు బాగా మందగించడం పెద్ద సమస్యగా మారింది. రాబోయేతరం పెద్దగా లేకపోవడంతో కార్మికశక్తి కొరత ఉంది. ఉత్పాదకత తగ్గిపోవడం, ఆర్థికవృద్ధి మందగించడం, అదే సమయంలో వృద్ధుల అవసరాల కోసం మరిన్ని నిధులు కేటాయించాల్సిరావడం వల్ల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఆ దేశాల్లో ఈ పరిస్థితులు దశాబ్దాల పాటు కొనసాగుతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) పేర్కొంది.

భారత్‌లో పరిస్థితి భిన్నం
భారతదేశ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మన జనాభాలో సగం పాతికేళ్ల లోపువారే. మూడింట రెండొంతుల మంది 35 ఏళ్లలోపు వారే. ఈ స్థాయిలో యువశక్తి ఉన్న దేశం భారత్‌ ఒక్కటే. ఒక విశ్లేషణ ప్రకారం 2027 నాటికి భారత్‌లో పని చేయగల సామర్థ్యం ఉన్న జనాభా (15–64 వయోశ్రేణి) వంద కోట్లకు చేరనుంది. దేశంలో సగటు సంతానోత్పత్తి రేటు 2.3 (సగ టున ఒక్కో మహిళకు పుట్టే బిడ్డలు). తమిళ నాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీల్లో ఇది 1.6గా ఉంది. ఈ మూడు చోట్ల సంతానోత్పత్తి రేటు ఇంచుమించు జర్మనీ, ఇటలీ (1.5) స్థాయిలో క్షీణించిందని, ఫ్రాన్స్‌ (2) బ్రిటన్, అమెరికా (1.9) కంటే తగ్గిపోయిందని యూఎన్‌ఎఫ్‌పీఏ (ఐరాస జనాభా నిధి) డేటా చెబుతోంది. యూపీ, మధ్యప్రదేశ్, బిహార్‌లలో సగటున ప్రతి మహిళా ముగ్గురికి పైగా పిల్లల్ని కంటున్నారు. బిహార్‌లో దేశంలో అత్యధిక జననాలు (3.3) నమోదవుతున్నాయని తాజా రికార్డులు వెల్లడిస్తున్నాయి. వీరందరికీ విద్య, శిక్షణ, నైపుణ్యాలను అందించడం, మౌలిక సదుపాయాలపరంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించడం వంటి నిర్మాణాత్మక చర్యలపై ప్రభుత్వాలు ఎంతమేరకు దృష్టి పెడతాయనే దానిపైనే మన దేశ ఆర్థికాభివృద్ధి ఆధారపడి వుందని సామాజికవేత్తలు చెబుతున్నారు.

క్షీణించిన విద్యా ప్రమాణాలు..
దేశంలో 14–18 వయసు పిల్లల్లో 57% మంది కనీసం రెండో తరగతి భాగాహారాలు కూడా చేయలేకపోతున్నారని ఇటీవల వెలువడిన వార్షిక విద్యా స్థితిగతుల నివేదిక వివరించింది. క్షీణించిన విద్యా ప్రమాణాలను మెరుగు పరచడంపై దృష్టి పెట్టాలని ఇలాంటి ఎన్నో నివేదికలు పదే పదే నొక్కి చెబు తున్నాయి. విద్య, వైద్య రంగాలపై పెట్టుబడుల పెట్టడం వల్ల నాణ్యమైన మానవ వనరులు సమకూరుతాయని, వృద్ధిరేటును పెంచుకోవడంలో ఇది అత్యంత కీలకమని సామాజికవేత్తలు వివరిస్తు న్నారు. స్కిల్‌ ఇండియా వంటి పథకాలను సమర్థంగా అమలు చేయడం, పని చేయగల జనాభాను ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తిలో భాగస్వాముల్ని చేయడం, సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు పెంచడంపై కేంద్రం మరింత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

వన్‌ చైల్డ్‌ పాలసీకి నో
ప్రపంచంలోని రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో.. దీర్ఘకాలంగా అమలు చేసిన ఒకే బిడ్డ విధానం (వన్‌ చైల్డ్‌ పాలసీ) కారణంగా జనాభా పెరుగుదల రేటు తగ్గింది. జననాల రేటు ఎక్కువగా వుండటం, 30 ఏళ్ల లోపు జనాభా మూడింట రెండొంతులకు చేరడం వంటి కారణాల నేపథ్యంలో చైనా ప్రభుత్వం 1979లో ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. వృద్ధ జనాభా పెరిగిపోయిన కారణంగా 35 ఏళ్ల పాటు కొనసాగించిన ఈ విధానానికి 2016లో స్వస్తి పలికింది. అధిక యువ జనాభాకి ఆర్థిక సరళీకరణ విధానాలు తోడవడంతో.. దాదాపు మూడు దశాబ్దాల పాటు చైనా దూసుకుపోయింది (1990 తర్వాత తొలిసారిగా ఆ దేశ వృద్ధి రేటు 2018లో 6.6%కు పడిపోయింది). వచ్చే పాతికేళ్లలో పని చేయగల సామర్థ్యమున్న వయో శ్రేణి 67% నుంచి 57% పడిపోనుంది. దీనికారణంగా 2040 నాటికి చైనా తలసరి జీడీపీ 15% మేర క్షీణిస్తుందని తాజా అంచనాలు చెబుతున్నాయి.

తగ్గుతున్న వర్కింగ్‌ ఏజ్‌ గ్రూప్‌
- పని చేయగల జనాభా (15–64 వయోశ్రేణి) తగ్గిపోతున్న దేశాల సంఖ్య ప్రస్తుతం 40కి చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనాల ప్రకారం.. అమెరికాలో 1975–2015 మధ్య 20–64 ఏళ్ల మధ్యనున్న వారి జనాభా ఏడాదికి 1.24% మేర పెరిగింది. కానీ తర్వాతి 40 ఏళ్లలో ఈ పెరుగుదల 0.29% మించబోదని అంచనా. ఐరోపాలో 2015–2055 మధ్య పని చేసే జనాభా 20శాతానికి పడిపోనుంది.
జపాన్‌లో మరెక్కడా లేనంతగా వృద్ధులు పెరిగిపోయారు. 65 ఏళ్లు పైబడిన వారే 26.3%గా ఉన్నారు. 2030 నాటికి వీరి సంఖ్య 32.2%కు చేరుతుందని అంచనా. 
2030 నాటికి బ్రిటన్‌లో 65ఏళ్లు పైబడిన వారు దాదాపు 50%కు చేరుకోనున్నారు. ఉద్యోగ విరమణ వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో పనుల్లో కొనసాగుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఇటలీలో 65% వయసు పైబడిన వారు 22.4% దాటారు. అక్కడ యువ జనాభా 14% మాత్రమే.
పలు అభివృద్ధి చెందిన దేశాలూ సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల జీడీపీపై, వినియోగంపై ఇది ప్రభావం చూపనుంది. బడ్జెట్‌లో వృద్ధుల ఆరోగ్యం, పింఛను సహా సామాజిక భద్రత కోసం వెచ్చించాల్సిన మొత్తాలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఉదాహరణకు 2014లో జర్మనీ జీడీపీలో 26శాతం  పింఛను సహా ఇతరత్రా వృద్ధుల అవసరాలకు వెచ్చించాల్సి వచ్చింది. 
2015లో ఇటలీ జీడీపీలో 16.5 శాతం పింఛన్లదే. యూరోపియన్‌ యూనియన్‌లో గ్రీస్‌ తర్వాత పింఛన్ల కోసం ఇంత మొత్తం వెచ్చిస్తున్న రెండో దేశం ఇటలీయే. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే.. పేద దేశాలు మరింతగా సంక్షోభంలోకి కూరుకుపోతాయని ఐరాస హెచ్చరిస్తోంది.

కృత్రిమ మేధతో భర్తీ అయ్యేనా?
వృద్ధ జనాభా పెరుగుదల సమస్య ఒక సంక్షోభం రూపు దాల్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చుట్టుముట్ట గలదని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని.. 
అమెరి కాకు చెందిన పీటర్‌సన్‌ ఇనిస్టిట్యూట్‌ హెచ్చరిస్తోంది. అయితే, ఈ సమస్యను చాలా మంది తక్కువ అంచనా వేస్తున్నారు. కృత్రిమ మేధ సహా రకరకాల సాంకేతికతల సాయంతో కార్మిక, ఉద్యోగుల కొరతను అధిగమించవచ్చునని భావిస్తున్నారు. ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని మానవ కొరత దుష్ప్రభావాన్ని ఊహించడం కష్టమని స్పష్టం చేసింది.

బిడ్డల్ని కనండి..
జననాల రేటు పెంచేందుకు కొన్ని దేశాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. జర్మనీ దశాబ్ద కాలంగా పిల్లలను కనేవారికి కల్పించే ప్రయోజనాలను, శిశు సంరక్షణ సౌకర్యాలను విస్తరించింది. దీంతో అక్కడ 2016లో (1996 తర్వాత తొలిసారిగా) ఎక్కువ మంది బిడ్డలు జన్మించారు. ఫ్రాన్స్, సింగపూర్, దక్షిణ కొరియా, టర్కీ, జపాన్‌ తదితర దేశాలు ఈ దిశగా ప్రోత్సహిస్తు న్నాయి. జపాన్‌లో 2దశాబ్దాల తర్వాత  2015లో జననాల రేటు స్వల్పంగా (1.46) పెరిగింది.

వలసదార్లే దిక్కు 
భారీగా వస్తున్న వలసదారుల కారణంగా.. కొన్ని దేశాలు కార్మికుల కొరతను అధిగమిస్తున్నాయి. అలాంటి దేశాల్లో అమెరికా ఒకటి. అయితే, ట్రంప్‌ అవలంభిస్తున్న వలస వ్యతిరేక విధానాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. వలస దార్లను తగ్గించుకోవడం వల్ల రానున్న దశాబ్దంలో అమెరికాకు కార్మిక కొరత తప్పేట్లు లేదు. వృద్ధులకు శిక్షణ ఇవ్వడం, వారి నైపుణ్యాలకు సానబెట్టడం వంటి చర్యల ద్వారా కార్మిక కొరతను కొంతవరకు అధిగమించవచ్చని.. ఐఎల్‌ఓ సూచిస్తోంది. సింగపూర్‌ ఇదే విధానాన్ని అనుసరిస్తోంది.

స్త్రీల భాగస్వామ్యమేదీ?
దేశ ఉత్పత్తిలో మహిళలు భాగస్వాములు అయినప్పుడే.. వారు ఆర్థిక సాధికారత దిశగా పయనించగలుగుతారు. ఆర్థిక వ్యవస్థలూ వృద్ధి చెందుతాయి. కానీ వీరికి పని కల్పించడంలో ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు. మన దేశంలో ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్గొనే మహిళలు 27%ను మించడం లేదు. పురుషులతో సమానంగా స్త్రీలను కార్మిక శక్తిలో భాగం చేసినట్టయితే, భారత్‌ జీడీపీలో 27% మేరకు వృద్ధి నమోదవుతుందంటున్నారు ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిష్టినా లగారే. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా