నేడే మహిళల పండుగ

8 Mar, 2018 01:43 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ప్రజలు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని గురువారం ఘనంగా జరుపుకోనున్నారు. ఈ ఏడాదికి మహిళా దినోత్సవం ఇతివృత్తంగా ‘ప్రెస్‌ ఫర్‌ ప్రోగ్రెస్‌’ (ప్రగతి కోసం పట్టుబట్టండి) నినాదాన్ని ఐక్యరాజ్య సమితి ఖరారు చేసింది. గత కొన్నేళ్లుగా స్త్రీలు అనేక రంగాల్లో పరుషులతో సమానంగా రాణిస్తున్నప్పటికీ ఇంకా ఆడ–మగ తారతమ్యాలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావించి పురుషులతో సమానంగా హక్కులు సాధించే లక్ష్యంతో ఈ నినాదాన్ని ఎంపిక చేశారు. 1975లో ఐక్యరాజ్య సమితి మార్చి 8ని మహిళా దినోత్సవంగా ప్రకటించింది. అయితే దీనికి ఎన్నో ఏళ్ల ముందు నుంచి కూడా అనేక దేశాల్లో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తొలిసారిగా అమెరికాలో 1909లో ఫిబ్రవరి 28ని మహిళా దినోత్సవంగా పాటించారు. 

ఫస్ట్‌ కంబాట్‌ ఆఫీసర్‌గా ప్రకృతి
న్యూఢిల్లీ: ఈ యువతి పేరు ప్రకృతి. ఐటీబీపీ చరిత్రలోనే తొలిసారిగా నేరుగా కంబాట్‌ అధికారిణిగా ఎంపికయ్యారు. బిహార్‌లోని సమస్తీపూర్‌ జిల్లా ఈమె స్వస్థలం. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఏపీఎఫ్‌) కోసం 2016లో యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షలో పాతికేళ్ల ప్రకృతి మాత్రమే కంబాట్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. పరీక్ష రాసిన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి తన కల నిజం చేసుకున్నారు. ‘యూనిఫామ్‌ ధరించి దేశ సేవ చేయాలనేది నా కోరిక. మా నాన్న భారత వైమానిక దళంలో పనిచేస్తున్నారు.

ఆయనే నాకు స్ఫూర్తి. ఐటీబీపీ యుద్ధక్షేత్రంలో అధికారులుగా మహిళలను ఎంపికచేయబోతున్నట్లు 2016 మార్చిలో ఓ పత్రికలో చదివా. యూపీఎస్సీ పరీక్షలో నెగ్గితే ఐటీబీపీలో చేరాలని అప్పుడు నిర్ణయించుకున్నా’ అని ప్రకృతి మీడియాతో చెప్పారు. ప్రకృతి బీటెక్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. ప్రస్తుతం పితోర్‌గఢ్‌లోని ఐటీబీపీ యూనిట్‌లో సేవలందిస్తున్నారు. ఐటీబీపీలో మహిళలున్నప్పటికీ వారంతా కానిస్టేబుల్‌ హోదావాళ్లే.  

    ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే అమలవుతున్న ‘బేటీ బచావో, బేటీ పఢావో’ పథకం విస్తరణకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం రాజస్తాన్‌లో ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు.



థానేలో నిర్వహించిన ఫ్యాషన్‌ షోలో ర్యాంప్‌పై నడిచిన ‘యాసిడ్‌ దాడి’ బాధితులు. ‘యాసిడ్‌ అమ్మకాలు నిలిపేయాలి’ అనే ఉద్యమంలో భాగంగా బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.  

 
             బుధవారం ఢిల్లీలో పార్లమెంటు ప్రాంగణంలో రక్షణ విధులు నిర్వర్తిస్తున్న ఢిల్లీ పోలీసు మహిళా కమెండో

 

మరిన్ని వార్తలు