ఘనం.. విశ్వయోగం

22 Jun, 2017 02:03 IST|Sakshi
ఘనం.. విశ్వయోగం

ప్రపంచవ్యాప్తంగా  ఘనంగా అంతర్జాతీయ యోగా డే
- లక్నోలో కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
- యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని ప్రధాని పిలుపు
- అహ్మదాబాద్‌లో 54వేల మందితో ఆసనాలు.. గిన్నిస్‌ రికార్డు  


న్యూఢిల్లీ: భారత్‌ సహా ప్రపంచమంతా బుధవారం యోగాసనమేసింది. ‘ఓంకార’ నాదంతో పుడమితల్లి మురిసింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు.. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం నుంచి పెరూలోని మచూ పిచూ, గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా వరకు మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి దేశంలోనూ యోగాసనాలు వేశారు. భారత్‌లోనూ రాజకీయ నాయకులు, అధికారులు, విద్యార్థులు, న్యాయమూర్తులు ఇలా యోగాపై ఆసక్తి ఉన్న వారంతా యోగా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. లక్నోలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న కార్యక్రమంలో 51వేల మంది వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఉత్సాహంగా పాల్గొన్నారు.

యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్‌లో యోగా గురు రాందేవ్‌ బాబా, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పాల్గొన్న కార్యక్రమంలో 54వేల మందికి పైగా పాల్గొనటం గిన్నిస్‌ రికార్డులకెక్కింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు యోగాసనాల కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. లండన్‌ ఐ, ఐఫిల్‌ టవర్‌ల వద్దకూడా భారీగా జనం ఆసనాలు వేశారు. న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి యోగాపై ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది.

యోగాతో మానసిక స్థైర్యం: మోదీ
మనస్సును స్థిరచిత్తంతో ఉంచటమే యోగా ప్రత్యేకత అని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. యోగా ద్వారా ఉచితంగానే ఆరోగ్యబీమా అందుతుందని చమత్కరించారు. లక్నోలోని రమాబాయి అంబేడ్కర్‌ మైదాన్‌లో యువత, చిన్నారులతో కలిసి మోదీ యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్‌ రాంనా యక్, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పురాతనమైన యోగా విధానం ద్వారా భారత్‌తో ప్రపంచం అనుసంధానమవుతోందన్నారు. ప్రపంచం ఆరోగ్యాన్ని అందుకునేందుకు భారత్‌ యోగా ద్వారా ప్రోత్సహిస్తోందన్నారు. ‘125 కోట్ల మంది భారతీయులు ఆరోగ్యం, మనసు, మేధస్సు ద్వారా చాలా మంది ని సమస్యలనుంచి రక్షించగలరు. యోగా ద్వారా మనస్సు స్థిరంగా ఉంటుంది’ అని మోదీ పేర్కొన్నారు.

శరీరాన్ని, మనస్సును, మేధస్సును ఏకం చేసే యోగా నేటి ప్రపంచాన్ని ఒకేతాటిపైకి తేవటంలో కీలకపాత్ర పోషిస్తోందన్నారు.   ఉపాధి కల్పనలోనూ యోగా పాత్ర కీలకమని మోదీ తెలిపారు. ఈ మూడేళ్లలో దేశంలో పెద్ద సంఖ్యలో యోగా శిక్షణ కేంద్రాలు వెలిశాయని, యోగా శిక్షకులకు మంచి డిమాండ్‌ ఏర్పడిందన్నారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో యువత, చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొనటంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. వర్షంలో తడవటం వల్ల 23 మంది స్వల్ప అస్వస్థతకు (జ్వరం, వణుకు) గురవటంతో తాత్కాలిక ఆసుపత్రుల్లో వారికి చికిత్సనందించారు. ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. ‘యోగాకు ఆదరణ కల్పించిన మీ అందరకి కృషి అభినందనీయం’ అని ట్వీట్‌ చేశారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పాల్గొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఏకైక పరిష్కారమన్నారు.

ఉత్సాహంగా పాల్గొన్న ముస్లింలు
ఆరెస్సెస్‌ ముస్లిం విభాగమైన ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ (ఎంఆర్‌ఎం)కి చెందిన 5వేల మంది కార్యకర్తలు యూపీలోని పలు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో దివ్యాంగులు, ముస్లిం మహిళలు కూడా యోగా ప్రదర్శనల్లో భాగమయ్యారు. ‘ఇది నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. వివిధ యోగాసనాలు వేస్తూ ఇక్కడ గడిపిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను’ అని ప్రధాని కార్యక్రమంలో పాల్గొన్న మావోకీ (48) అనే జపనీయుడు తెలిపారు. ‘ప్రధాని  మోదీతో కలిసి యోగా చేయటం జీవితంలో మరిచిపోలేని అనుభూతి’ అని ప్రేన్‌షా (19) అనే యువతి తెలిపింది. ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌లో జరిగిన కార్యక్రమంలో 10వేల మంది పాల్గొన్నారు. అయితే లండన్‌ తరహా దాడులు జరిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలతో యోగాసనాల వేదిక చుట్టూ బస్సులు నిలిపి భద్రత కల్పించారు.

అమిత్‌కు రాజకీయ బరువు
‘యోగా చేస్తూ అమిత్‌ షా తన బరువును తగ్గించుకున్నారు. కానీ రాజకీయ బరువును పెంచుకుంటున్నారు. ఇది చాలా మందికి టెన్షన్‌ పెడుతోంది. వారు కూడా ఒత్తిడిని తగ్గించుకునేందుకు రోజూ యోగాచేయాలని కోరుతున్నా’ అని అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అమిత్‌షాను రాందేవ్‌ బాబా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో 54 వేల మంది యోగాసనాలు వేశారు. గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు