నీదెంత మంచి మనసురా చిన్నోడా!

4 Apr, 2019 10:35 IST|Sakshi

కార్లలో రయ్‌మని దూసుకుపోతూ అడ్డొచ్చిన వారిని ఢీకొట్టేసి వెళ్లిపోయే వారి గురించి రోజూ వింటూనే ఉంటాం. ఇక బాధ్యతారాహిత్యంగా డ్రైవ్‌ చేసి హిట్‌ అండ్‌ రన్‌ కేసులో చిక్కుకున్నా పద్ధతి మార్చుకోని ‘సెలబ్రిటీలు’ కోకొల్లలు. అటువంటి వ్యక్తులు ఈ ఆరేళ్ల పిల్లాడిని చూసి కాస్తైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలుకుతున్నారు నెటిజన్లు. సైకిల్‌తో యాక్సిడెంట్‌ చేసి కోడిపిల్లకు గాయం చేశాననే బాధతో విలవిల్లాడుతున్న ఈ చిన్నారి ఎందరికో ఆదర్శమని ప్రశంసలు కురిపిస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. మిజోరాంలోని సైరంగ్‌కు చెందిన డెరెక్‌ లాల్‌చన్‌హిమా అనే ఆరేళ్ల పిల్లాడు రోజూలాగే ఆడుకోవడానికి సైకిల్‌పై బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడికి ఎదురొచ్చిన కోడిపిల్ల అనుకోకుండా సైకిల్‌ కింద పడింది. దీంతో వెంటనే వాళ్ల నాన్న దగ్గరికి పరిగెత్తుకొచ్చిన డెరెక్‌.. కోడిపిల్లను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని పట్టుబట్టాడు. అయితే అప్పటికే అది చనిపోయిందని చెప్పినా వినిపించుకోకుండా.. తన కిడ్డీబ్యాంకులో ఉన్న 10 రూపాయలు తీసుకుని తానే ఆస్పత్రికి తీసుకువెళ్లాడు.

ఈ నేపథ్యంలో డెరెక్‌ అమాయత్వం చూసిన అక్కడి నర్స్‌.. ఓ చేతిలో కోడిపిల్ల.. మరోచేతిలో 10 రూపాయలు పట్టుకుని దీనంగా చూస్తున్న డెరెక్‌ ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు.. ‘ నీదెంత మంచి మనసురా చిన్నోడా. ఎంతో మంది పెద్ద వాళ్ల కంటే కూడా గొప్పగా ఆలోచించావు. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. పెద్దయ్యాక కూడా ఇలాగే నిజాయితీగా నడచుకోవాలి అంటూ లైకులు, షేర్లతో అతడిని ఆశీర్వదిస్తున్నారు. కాగా ఈ విషయం గురించి డెరెక్‌ తండ్రి మాట్లాడుతూ.. తను చెబితే వినలేదనే కోపంతో డెరెక్‌ స్వయంగా ఆస్పత్రికి పరిగెత్తాడని తెలిపారు. 10 రూపాయలు సరిపోవని భావించి మళ్లీ వచ్చి 100 రూపాయలు తీసుకువెళ్లాడని చెప్పారు. తన కొడుకు ఓ ప్రత్యేకమైన పిల్లాడని, తనను ఆదర్శంగా పెంచుతానని ఆ పోలీసు తండ్రి చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు