అత్యాచారాలకు అదే కారణం : బీజేపీ ఎంపీ

7 Jul, 2018 22:02 IST|Sakshi

యువత అశ్లీల చిత్రాలు చూడడం వల్లనే అత్యాచారాలు : బీజేపీ ఎంపీ నందకుమార్‌ సింగ్‌

భోపాల్‌ : ఇంటర్‌నెట్‌‌, మొబైల్‌ ఫోన్స్‌లో అశ్లీల చిత్రాలకు యువత అకర్షణకు గురవుతున్నారని, దాని వల్లనే దేశంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ నందకుమార్‌ సింగ్‌ పలు వ్యాఖ్యలు చేశారు. వీటి వల్ల అమాయక వ్యక్తులపై కూడా చెడు ప్రభావం పడుతోందని అన్నారు. కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో పాకిస్తాన్‌ ప్రమేయం ఉందని ఖాండ్వా బీజేపీ ఎంపీ నందకుమార్‌ సింగ్‌ గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మొబైల్‌ ఫోన్స్‌లో అశ్లీల చిత్రాలను సైబర్‌ సెల్‌ పోలీసులు ఎందుకు నియంత్రించలేకపోతున్నారు అని ఓ విలేకరి అడగగా... ప్రతీ వ్యక్తి మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు రహస్యంగా చెక్‌ చెయాలేరుగా అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు.

చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాల్లో దేశంలోనే మధ్యప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందని, అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి మానక్‌ అగర్వాల్‌ విమర్శించారు. ప్రభుత్వమే విఫలమైనప్పుడు మొబైల్‌ ఫోన్స్‌, ఇంటర్‌నెట్‌ లాంటివి ఏం చెయగలవని అన్నారు. క్రిమినల్స్‌పై చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమైయ్యారని, అదే మహిళలపై అత్యాచారాలకు దారి తీస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై, బాలికలపై పెరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా కాంగ్రెస్‌ మహిళా విభాగం నేడు సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నివాసం ఎదుట ధర్నా నిర్వహించింది.

>
మరిన్ని వార్తలు