జేఎన్‌యూ హింస: ముసుగు ధరించిందెరు?

11 Jan, 2020 17:44 IST|Sakshi

వర్సిటీ హింసపై పోలీసుల విచారణ వేగవంతం

ముసుగు దుండుగులను గుర్తించే ప్రయత్నం

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ (జేఎన్‌యూ) యూనివర్సిటీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ దాడిలో అనుమానితులుగా భావిస్తున్న తొమ్మిది మంది ఫోటోలను ఇదివరకే బటయకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈనెల 5న జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిని విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌తో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన వారు ఉన్నారంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే దాడి జరిగిన రోజున రాత్రి ముసుగులు ధరించిన దుండగులు చేతిలో కర్రలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, టీచర్లపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డ విషయం తెలిసిందే. వారి దాడిలో  ఆయిషీ ఘోష్‌ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. (ఎవరీ ఆయిషీ ఘోష్‌?)

తాజా విచారణ నేపథ్యంలో ఆ ముసుగు ధరించిన దుండుగులు ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వర్సిటీ పరిధిలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు దొరికిన ఆధారాల ఆధారంగా ముసుగు దుండుగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముసుగు దరించి గుంపులో ఉన్న యువతిని కోమల్‌ శర్మ అంటూ, ఆమె ఏబీవీపీకి చెందిన సభ్యురాలు అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఆమెకు సంబందించిన గత ఫోటోలు సైతం నెట్టింట్లో దర్శినమిచ్చాయి. దుండగులు ముసుగులు ధరించి, యథేచ్ఛగా యూనివర్సిటీలో కనిపించినవారినల్లా కొడతూ భయోత్పాతం సృష్టించారు. ముఖం కనిపించకుండా కప్పుకుని, హాకీ స్టిక్స్‌తో ఒక భవనంలోపల తిరుగుతున్న కొందరు దుండగుల వీడియోను పలు వార్తాచానెళ్లు ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో పలు వార్తా సంస్థలు చేపట్టిన స్టింగ్‌ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. దాడి గురించి చర్చించుకుంటున్న ఓ వీడియో బయటకువచ్చింది. దీనిలో ఏబీవీపీకి చెందిన అక్షత్‌ అవాస్తీ దాడికి నాయకత్వం వహించింది తానేనని చెబుతున్నట్టు అర్థమవుతోంది. (‘జేఎన్‌యూ దాడి మా పనే’)

అయితే వీటిపై పోలీసులు మాత్రం ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. వర్సిటీ హాస్టల్‌ లోపలికి చొరబడి దాడికి దిగింది ఎవరనే అనేది ఇప్పటికీ తేలలేదు. దీంతో నిందితులను గుర్తించడం పోలీసులుకు పెద్ద సవాలుగా మారింది. మరోవైపు ఈ దాడిపై వామపక్ష విద్యార్థి సంస్థ జేఎన్‌యూఎస్‌యూ, బీజేపీ అనుబంధ ఏబీవీపీ పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. జేఎన్‌యూఎస్‌యూనే ఈ దాడికి పాల్పడిందని, ఈ దాడిలో తమ సభ్యులు పాతిక మందికి గాయాలయ్యాయని, మరో 11 మంది జాడ తెలియడం లేదని ఏబీవీపీ ఆరోపిస్తోంది. వామపక్ష విద్యార్థి సంస్థలు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ, డీఎస్‌ఎఫ్‌ విద్యార్థులు ఈ దాడుల వెనుక ఉన్నారని పేర్కొంది.

మరిన్ని వార్తలు