కార్తీని కోర్టు ఎదుట హాజరుపర్చిన సీబీఐ

1 Mar, 2018 16:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంను సీబీఐ గురువారం ఢిల్లీ కోర్టులో హాజరుపరిచింది. కార్తీని 14 రోజుల కస్టడీకి అనుమతించాలని ప్రత్యేక జడ్జి సునీల్‌ రాణాను సీబీఐ కోరింది. నిందితుడిని సహ నిందితుడు, ఇతర నిందితులు, అనుమానితులతో కలిసి విచారించేందుకు సమయం పడుతుందని..తాము సమీకరించిన ఆధారాలపై అతడిని ప్రశ్నించాల్సి ఉందని అంటూ కార్తీని కనీసం 14 రోజుల పాటు విచారించాలని అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు నివేదించారు. కార్తీ తల్లి, సీనియర్‌ అడ్వకేట్‌ నళినీ చిదంబరం కోర్టులో కుమారుడి పక్కనే కూర్చున్నారు.

ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులకు తన తండ్రి ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన సమయంలో అనుమతులు ఇప్పించారనే ఆరోపణలను కార్తీ చిదంబరం ఎదుర్కొంటున్నారు. ఇందుకు ప్రతిఫలంగా కార్తీ చిదంబరంకు భారీగా ముడుపులు ముట్టాయని సీబీఐ ఆరోపిస్తోంది. మరోవైపు తనపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారని కార్తీ పేర్కొంటున్నారు. సీబీఐ తనకు కనీసం సమన్లు ఇవ్వకుండా ఇప్పుడు విచారణకు సహకరించడం లేదని ఆరోపించడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సీబీఐ పక్షపాతపూరితంగా వ్యవహరిస్తోందని కార్తీ తరపు న్యాయవాది, కాంగ్రెస్‌ నేత సింఘ్వీ అన్నారు.
 

మరిన్ని వార్తలు