ఈడీ ఎదుట కార్తీ చిదంబరం

7 Feb, 2019 11:40 IST|Sakshi

న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరం గురువారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులకు.. ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు.. ఏ ప్రాతిపదికన అనుమతి ఇచ్చిందో చెప్పాలని ఈడీ ప్రశ్నించింది.

ఇదిలా ఉండగా ఈ కేసులో మరో నిందితురాలు, మీడియా టైకూన్‌ పీటర్‌ ముఖర్జియా భార్య ఇంద్రాణి అప్రూవర్‌గా మారేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆమె ఢిల్లీ కోర్టుకు అప్పీలు చేసుకున్నారు. అయితే ఇంద్రాణి అప్రూవర్‌గా మారేందుకు గల కారణాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు భావిస్తోంది. ఆమె ఎవరి నుంచైనా బెదిరింపులు ఎదుర్కొంటున్నారా లేదా ఇందుకు ప్రతిగా మరేదైనా లాభం పొందాలనుకుంటున్నారా అన్న అంశాలపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ఇక గత విచారణలో భాగంగా ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో పెట్టుబడుల అనుమతికి కార్తీ చిదంబరం.. 1 మిలియన్‌ డాలర్లు ఇవ్వాలంటూ తన భర్త పీటర్‌ను డిమాండ్‌ చేశారని ఇంద్రాణి పేర్కొన్నారు. కాగా ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో గతేడాది ఫిబ్రవరిలో కార్తీ చిదంబరం అరెస్టైన సంగతి తెలిసిందే. కార్తీ తండ్రి పి.చిదంబరం.. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఈ లావాదేవీలు జరగడంతో ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కార్తీ మరిన్ని చిక్కుల్లో పడనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు