రైలు ఆలస్యానికి పరిహారం

20 Oct, 2019 22:27 IST|Sakshi

దేశంలో ఇదే తొలిసారి

లక్నో: దేశంలోనే మొదటి ప్రైవేటు రైలు తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించినప్పుడు ఒక వేళ ఏదైనా కారణంతో రైలు ఆలస్యమైతే అందుకు పరిహారం చెల్లిస్తామని ఐఆర్‌సీటీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాటకు కట్టుబడిన ఐఆర్‌సీటీసీ శనివారం తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండు గంటలు ఆలస్యం నడవడంతో అందులో ప్రయాణించిన ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.250 చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. శనివారం రైలులో ప్రయాణించిన ప్రయాణికులందరి ఫోన్లకు ఒక వెబ్‌ లింక్‌ను సందేశం ద్వారా పంపించామని, ఆ లింక్‌ ద్వారా ప్రయాణికులు పరిహారాన్ని క్లెయిమ్‌ చేసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ చీఫ్‌ రీజనల్‌ మేనేజర్‌ అశ్విని శ్రీవాస్తవ తెలిపారు. శనివారం లక్నో నుంచి ఢిల్లీకి రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరిన తేజస్‌ ఎక్స్‌ప్రెస్, తిరుగు ప్రయాణంలోనూ రెండు గంటలు ఆలస్యంగా నడిచింది. లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లేటప్పుడు 451 మంది, తిరుగు ప్రయాణంలో 500 మంది ప్రయాణికులు ప్రయాణించారు. రైలు ఆలస్యమైనందుకు అందులోని ప్రయాణికులకు పరిహారం అందించడం దేశంలో ఇదే మొదటిసారి.  

మరిన్ని వార్తలు