30 వరకూ రైల్వే బుకింగ్‌లు రద్దు

7 Apr, 2020 19:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పొడిగింపుపై సంప్రదింపులు సాగుతున్న క్రమంలో ఈనెల 30 వరకూ తాను నిర్వహిస్తున్న మూడు ప్రైవేట్‌ రైళ్ల సర్వీసులను నిలిపివేయాలని భారత రైల్వేల అనుబంధ ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది.  ఐఆర్‌సీటీసీ ప్రస్తుతం రెండు తేజాస్‌ రైళ్లను, కాశీ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతోంది. ఈ రైళ్లలో ఈనెల 30 వరకూ టికెట్ల బుకింగ్‌ను రద్దు చేసినట్టు వెల్లడించింది. ముందుగా టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణీకులందరికీ పూర్తి సొమ్మును రిఫండ్‌ చేస్తామని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. అంతకుముందు ఐఆర్‌సీటీసీ 21 రోజుల లాక్‌డౌన్‌ ముగిసే ఏప్రిల్‌ 14 వరకూ బుకింగ్స్‌ను సస్పెండ్‌ చేసింది.

కాశీ మహాకాళ్‌ ఎక్స్‌ప్రెస్‌ వారణాసి-ఇండోర్‌ రూట్‌లో రాకపోకలు సాగిస్తుండగా, తేజాస్‌ రైళ్లు లక్నో-న్యూఢిల్లీ, అహ్మదాబాద్‌-ముంబై రూట్లలో నడుస్తున్నాయి. ఈ రూట్లలో ప్రైవేట్‌ రైళ్లను ఏప్రిల్‌ 15-30 వరకూ ఐఆర్‌సీటీసీ నిలిపివేసింది. దేశవ్యాప్తంగా 28 ప్రాంతాల్లోని తమ కిచెన్లలో ఆహారం సిద్ధం చేసి ప్రజలకు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేపట్టామని ఐఆర్‌సీటీసీ తెలిపింది.

చదవండి : చుక్‌ చుక్‌ బండి.. దుమ్మురేపింది!

మరిన్ని వార్తలు