విధ్వంసానికి ప్లాన్.. రైలు పట్టాలపై అడ్డంగా..

26 Jan, 2017 15:45 IST|Sakshi
విధ్వంసానికి ప్లాన్.. రైలు పట్టాలపై అడ్డంగా..

ముంబయి: మొన్న కాన్పూర్‌.. నిన్న విజయనగరం.. నేడు ముంబయి.. ఈ మూడింట్లో రెండు చోట్ల భీకర రైలు ప్రమాదాలు చోటుచేసుకోగా ముంబయిలో మాత్రం డ్రైవర్‌ అప్రమత్తత కారణంగా ఒక పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే గణతంత్ర దినోత్సవ వేళ మరో విషాదాన్ని గురించి చర్చించుకోవాల్సి వచ్చేది. గుర్తు తెలియని దుండగులు ఎవరో పట్టాలపై అడ్డంగా పెద్ద విరిగిన రైలుపట్టాను పెట్టారు. దాదాపు 15 మీటర్ల పొడవుండే పట్టాను రైలు ప్రమాదానికి గురయ్యేలా ఉంచి విధ్వంసక రచనకు దిగారు. ఈ ఘటన బుధవారం ముంబయిలోని దివా జంక్షన్‌కు సమీపంలో చోటుచేసుకుంది.

మడ్గావ్‌ నుంచి దాదార్‌కు వెళుతున్న జన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ఆ సమయంలో పట్టాలపై వెళుతోంది. అయితే, డ్రైవర్‌ అప్రమత్తత కారణంగా అతడు ముందుగానే పట్టాలపై అడ్డంగా పెట్టిన మరో పట్టాను గుర్తించి అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపేశాడు. అనంతరం కొంతమంది సహాయకుల ద్వారా దానిని పక్కకు తీసి పడేసి పదిహేను నిమిషాలు ఆలస్యంగా తిరిగి రైలు బయలుదేరింది. దీనిపై అత్యున్నతస్థాయి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల అనుమానాస్పద స్థితిలో రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటిల్లో విధ్వంసక శక్తుల ప్రమేయం ఉందని అనుమానాలు తలెత్తిన నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఈ ఘటన రైల్వే అధికారుల్లో మరింత గుబులు రేకెత్తిస్తోంది.

>
మరిన్ని వార్తలు