21వ శతాబ్దంలో 19వ శతాబ్దం రూల్సా?

17 Dec, 2015 14:13 IST|Sakshi
21వ శతాబ్దంలో 19వ శతాబ్దం రూల్సా?

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అతి పెద్దది. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా పార్లమెంట్ సమావేశాలు మాత్రం ఎన్నడూ సవ్యంగా నడవవు. నిన్నటి వర్షాకాల సమావేశాలు కళంకిత మంత్రులను ఉపేక్షించడంపై తుడిచిపెట్టుకుపోగా, నేటి శీతాకాల సమావేశాలు దేశంలో పెరుగుతున్న అసహనం, రగులుతున్న నేషనల్ హెరాల్డ్ వ్యవహారంతో తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఫలితంగా వస్తుసేవల పన్ను లాంటి ముఖ్యమైన పలు బిల్లులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. ఎందుకు పార్లమెంట్ సమావేశాలు సవ్యంగా కొనసాగడం లేదు? దీనికి పరిష్కారం లేదా? అన్న అనుమానాలు వస్తాయి.

అమెరికా, బ్రిటన్ దేశాల పార్లమెంటరీ వ్యవస్థలను అనుసరించి 19వ శతాబ్దంలో మనం ఏర్పాటు చేసుకున్న పార్లమెంటరీ ద్విసభ విధానం, అనుసరిస్తున్న నియమ నిబంధనలే ప్రస్తుత పరిస్థితికి కారణం. అమెరికా, బ్రిటన్ దేశాలే ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా పార్లమెంటరీ వ్యవస్థలో మార్పులు తెచ్చినప్పుడు మన వ్యవస్థలో కూడా మార్పుల కోసం ఎందుకు ప్రయత్నించకూడదు? దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగేందుకు ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్‌నే ఏర్పాటు చేసుకున్నప్పుడు పార్లమెంటరీ వ్యవస్థలో మాత్రం ఎందుకు మార్పులు తీసుకురాకూడదు!

నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ గత లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్ల మెజారిటీతో అధికారంలోకి రావడం దాదాపు గత మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారని చెప్పవచ్చు. అయినా మోదీ ప్రభుత్వంలో విధానపర నిర్ణయాలు సక్రమంగా జరగడం లేదు. మోదీ గొప్పగా చెప్పుకుంటూ వస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందే అవకాశాలు కనిపించడం లేదు. కారణం, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీదే పైచేయి అవడం, పాలకపక్ష పార్టీ మైనారిటీలో కొనసాగడం. రాజ్యసభలో ఆర్థిక బిల్లులను తప్పించి ఇతర విధానపరమైన బిల్లులను ప్రస్తుతం ప్రతిపక్షమే శాశిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్‌లో ప్రజా ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం ఎక్కడ? పార్టీలకు అతీతంగా సభ్యులు సొంత నిర్ణయాలు తీసుకోకుండా 1985లో తీసుకొచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా అడ్డు పడుతోంది. విప్‌ల పేరిట పార్టీ నాయకత్వం తమ సభ్యులను నియంత్రిస్తుంది. ఇలాంటి సమయాల్లో పార్టీ నాయకత్వం మాటే చెల్లుతుంది తప్ప ప్రజాప్రతినిధుల మాట చెల్లదు. అణ్వస్త్రాల ప్రయోగం, ప్రభుత్వాలపై అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టడం లాంటి అంశాలకు మాత్రమే పార్లమెంట్ నిబంధనలు కచ్చితంగా ఉన్నాయి గానీ చర్చనీయాంశాల ఎజెండా, తీసుకరావాల్సిన తీర్మానాలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేకపోవడం శోచనీయం. పార్లమెంట్ సభ్యుల అవగాహనతో వీటిని నిర్ణయించాల్సి ఉంటుందని పార్లమెంట్ నిబంధనలు తెలియజేస్తున్నాయి. ప్రజా ప్రయోజనం కాకుండా పార్టీల స్వప్రయోజనాలే ముఖ్యమైన నేటి వ్యవస్థలో రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదరడం అసాధ్యమే!

అమెరికా సెనేట్ వ్యవస్థను పాక్షికంగా అనుసరించి రాజ్యసభ స్వరూపాన్ని ఏర్పాటు చేసుకున్న మనం సంస్కరణల దిశగా ఎందుకు ఆలోచించడం లేదు? అమెరికా సెనేట్ వ్యవస్థలో 1913లోనే సంస్కరణలు తీసుకొచ్చి ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేశారు. 1911, 1949లలోబ్రిటన్ ప్రభువుల సభ (హౌస్ ఆఫ్ లార్డ్స్)లో మార్పులు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ సభకు ఎలాంటి బిల్లునైనా ఏడాది పాటు ఆపవచ్చు గానీ తిరస్కరించే అధికారం లేదు. ఆ తరహా మార్పులతో మన రాజ్యసభను ఎందుకు తీర్చిదిద్దకూడదు! నేటి 21వ శతాబ్దంలో కూడా 19వ శతాబ్దం నాటి నియమ నిబంధనలనే పాటించడం ఏ మేరకు సబబు!

మరిన్ని వార్తలు