ఇండియా హిందువులదేనా?

6 Apr, 2016 18:52 IST|Sakshi
ఇండియా హిందువులదేనా?

నాగ్పూర్: నాగ్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్పై బొంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ భారతదేశం కేవలం హిందువుల కోసమే అని మీ ఉద్దేశమా అని ప్రశ్నించింది. నాగ్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడి అధికారులు ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇదే కార్యక్రమంతో ముడిపెడుతూ ఓ హనుమాన్ ఆలయం ట్రస్టు ద్వారా హనుమాన్ చాలీసా నిర్వహించాలని నిర్ణయించారు.

దీనిపై కొందరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లారు. దీంతో న్యాయమూర్తి కార్పొరేషన్ అధికారులను ప్రశ్నించారు. ఎందుకు కేవలం హనుమాన్ స్తోత్రాలను మాత్రమే అనుకుంటున్నారు? ఖురాన్, బైబిల్ వంటి ఇతర మతాల సాహిత్యాన్ని ఎందుకు ఉపయోగించకూడదని అనుకున్నారు? ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమానికి హనుమాన్ చాలీసాను స్మరించడానికి సంబంధం ఏమిటి? ఈ అవగాహన కార్యక్రమం కేవలం హిందువుల కోసమేనా? ఈ భారత దేశం హిందువులకోసమే అని మీ అభిప్రాయమా? అని ప్రశ్నించారు.

ఏ మతంపైనా తమకు ప్రత్యేకమైన అభిమానం కోపం లేదని, ఈ రెండు కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహించాలని ఆదేశించారు. కనీసం వీటికి మధ్య గంట వ్యవధి ఉండాలని చెప్పారు. ప్రభుత్వ సంస్ధలు అనేవి ప్రజాసంబంధమైన అంశాలకోసం ఎక్కువగా పనిచేయాలని చెప్పారు. ఇందుకు అధికారులు కూడా అంగీకరించారు.

మరిన్ని వార్తలు