ఐఎస్ మద్దతుదారుడి అరెస్ట్

14 Dec, 2014 03:16 IST|Sakshi
ఐఎస్ మద్దతుదారుడి అరెస్ట్
  • ‘ట్వీటర్ ఖాతా’ మెహ్దీని పట్టుకున్న పోలీసులు
  • ఐటీసీ ఫుడ్స్‌లో ఏటా 5.3 లక్షల వేతనంతో ఉద్యోగం చేస్తున్న మెహ్దీ
  • సాక్షి, బెంగళూరు: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాదులు వినియోగించే ట్వీటర్ ఖాతాను నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన మెహ్దీ మస్రూర్ బిస్వాస్(24) గత కొన్నేళ్లుగా ఈ ఖాతాను నిర్వహిస్తున్నట్లు తేలింది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఇతడు ఐటీసీ ఫుడ్స్ సంస్థలో ఏటా రూ.5.3 లక్షల వేతన ప్యాకేజీతో ఎగ్జిక్యూటివ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

    బెంగళూరులో అద్దె నివాసం నుంచి అతడిని అరెస్టు చేసినట్లు కర్ణాటక డీజీపీ లాల్‌రుకుం పచావో శనివారమిక్కడ విలేకరులకు వెల్లడించారు. ఐఎస్‌ఐఎస్ ఖాతాను తానే నిర్వహిస్తున్నట్లు మెహ్దీ అంగీకరించాడని తెలిపారు. ఐఎస్ ఉగ్రవాదుల ట్వీటర్ ఖాతాను ‘షామీ విట్‌నెస్’ పేరుతో బెంగళూరుకు చెందిన మెహ్దీ నిర్వహిస్తున్నాడని, బ్రిటన్‌కు చెందిన చానల్ ‘4 న్యూస్’ బయటపెట్టిన సంగతి తెలిసిందే.

    అరెస్టు చేస్టున్న సమయంలో మెహ్దీ నుంచి ఎలాంటి ప్రతిఘటన లేదని బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తెలిపారు. ‘బిశ్వాస్‌పై ఐపీసీ సెక్షన్ 125 (వ్యక్తిగతంగాగానీ సమూహంగాగానీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం లేదా అందుకు యత్నించడం), సెక్షన్ 18, సెక్షన్ 39లతోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66 కింద కేసులు నమోదు చేశాం.

    అతడి నుంచి రెండు ఫోన్లు, ఒక ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నాం’’ అని  తెలిపారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని,  మన దేశం వరకైతే ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాల్లో అతడి ప్రమేయం లేదని అన్నారు.  ఐఎస్ ఉగ్రవాద సంస్థలో బిశ్వాస్ ఇప్పటివరకు ఎవరినీ చేర్చలేదని. విదేశాలకు కూడా ఎప్పుడూ వెళ్లలేదని అన్నారు.
     
    పగలు ఉద్యోగం.. రాత్రి ఇంటర్నెట్‌లో..

    బిశ్వాస్ పగలంతా ఉద్యోగం చేస్తూ రాత్రి వేళలో ఇంటర్నెట్ ముందు గడిపేవాడని డీజీపీ పచవ్ తెలిపారు. ఐఎస్‌ఐఎస్/ఐఎస్‌ఎల్ వెబ్‌సైట్లలో బ్రేకింగ్ న్యూస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 60 జీబీ డేటా సామర్థ్యంగల ఇంటర్నెట్ కనెక్షన్‌ను వాడుతున్నాడని వివరించారు. బిశ్వాస్‌కు ఇద్దరు అక్కలు ఉన్నారని, ఇతడి తండ్రి పశ్చిమబెంగాల్ విద్యుత్ బోర్డులో పనిచేసి రిటైర్డ్ అయ్యారని వివరించారు.
     
    నమ్మను: బిశ్వాస్ తండ్రి

    కోల్‌కతా: బిశ్వాస్‌కు ఐఎస్‌తో సంబంధాలున్నాయని నమ్మడం లేదని ఆయన తండ్రి శ్వాస్ చెప్పారు. కుమారుడి ఇంటర్నెట్ అకౌంట్‌ను ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చని అన్నారు. ‘‘ఈ విషయం తెలియగానే శుక్రవారం ఫోన్ చేసి అడిగాను. ఇదంతా ఎలా జరిగిందో అర్థం కావడం లేదని చెప్పాడు’ అని తెలిపారు.
     

మరిన్ని వార్తలు