హిజాబ్‌ ధరించి హిందూ కార్యక్రమానికి వెళతావా?

18 Jul, 2019 20:50 IST|Sakshi

కోల్‌కతా : హనుమాన్‌ చాలీసా పఠనానికి హాజరైన బీజేపీ నేత, ట్రిపుల్‌ తలాఖ్‌ పిటిషనర్‌ ఇష్రత్‌ జహాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. హనుమాన్‌ చాలీసా పఠనానికి హిజాబ్‌ ధరించి వెళ్లినందుకు చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. కోల్‌కతాలో నివసిస్తున్న ఇష్రత్‌ జహాన్‌ మంగళవారం ఇంటి దగ్గర్లోని సామూహిక హనుమాన్‌ చాలీసా కార్యక్రమానికి హిజాబ్‌ ధరించి హాజరయింది. దీంతో ఆగ్రహించిన కొందరు వ్యక్తులు బుధవారం ఇష్రత్‌ జహాన్‌ ఇంటికి వస్తున్న సమయంలో ఆమెను చుట్టుముట్టారు. ఆమెపై దూషణల పర్వానికి దిగారు. నువ్వు చేసిన పని వల్ల ముస్లిం సమాజాన్ని కించపరిచావని ఆరోపించారు. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టమంటూ భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో ఇష్రత్‌ జహాన్‌  తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. తనపై బెదిరింపులకు దిగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ విషయం గురించి ఇష్రత్‌ జహాన్‌ మాట్లాడుతూ.. ‘మా బావ, ఇంటి యజమాని సైతం అసభ్యంగా దూషించారు. ఇల్లు ఖాళీ చేయాలని వేధిస్తున్నారు. నన్ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఏ క్షణమైనా నాకు హాని తలపెట్టవచ్చు ’ అని వాపోయారు. దీనిపై గొలాబరి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ మాట్లాడుతూ.. ‘తనకు నచ్చినట్టుగా ఉండటంలో తప్పేంటి?’ అని ప్రశ్నించారు. అయినా మమతా బెనర్జీ, టీఎంసీ నాయకులు నమాజ్‌ ఇచ్చినపుడు ప్రశ్నించని నోళ్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయో అర్థం కావట్లేదని మండిపడ్డారు.

కాగా ట్రిపుల్‌ తలాక్‌ కేసు వేసిన ఐదుగురు పిటిషనర్లలో ఇష్రత్‌ జహాన్‌ ఒకరు. ఆమెకు ఒక కొడుకుతో పాటు 14 సంవత్సరాల కూతురు కూడా ఉంది. ఆమె భర్త 2014లో దుబాయ్‌లో ఫోన్‌ నుంచి ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి విడాకులు తీసుకోగా ఆమె అపెక్స్‌ కోర్టును ఆశ్రయించింది. 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు ట్రిపుల్‌ తలాక్‌ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం జనవరి 1న జహాన్‌ బీజేపీలో చేరారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు