ఇష్రత్ జహాన్ లష్కరే ఉగ్రవాది

12 Feb, 2016 01:32 IST|Sakshi
ఇష్రత్ జహాన్ లష్కరే ఉగ్రవాది

వీడియో కాన్ఫరెన్స్ వాంగ్మూలంలో హెడ్లీ వెల్లడి
* ఈ విషయాన్ని లఖ్వీయే చెప్పాడన్న డేవిడ్
* ‘బాబ్రీ’కి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలోనే ఎన్‌కౌంటర్

ముంబై: 2008 ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన పాకిస్తానీ అమెరికన్, లష్కరే ఉగ్రవాది డేవిడ్ కోలెమన్ హెడ్లీని విచారిస్తున్న కొద్దీ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2004లో గుజరాత్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్లో మృతిచెందిన 19 ఏళ్ల ఇష్రత్ జహాన్.. లష్కరే తోయిబా ఉగ్రవాదని గురువారం జరిగిన వీడియో లింక్ వాంగ్మూలంలో హెడ్లీ వెల్లడించాడు.

‘భారత్‌లో పోలీసులపై కాల్పులు జరిపే వ్యూహంతో.. లష్కరే ఉగ్రవాది ముజమ్మిల్ భట్ ప్రయత్నాలు చేస్తుండగానే ఓ మహిళా ఉగ్రవాది ఎన్‌కౌంటర్ అయిందని లష్కరే కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ చెప్పారు’ అని హెడ్లీ పేర్కొన్నారు. ఆమె భారతీయురాలే అయినా.. లష్కరేలో క్రియాశీలకంగా పనిచేసినట్లు లఖ్వీ మాటలతో తెలిసిందన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా అక్షర్‌ధామ్ మందిరంపై దాడికి లష్కరే ఉగ్రవాది అబూ కఫా ప్రయత్నించాడన్నారు.

భారత్‌లో దాడులకు లష్కరే తోయిబా, ఐఎస్‌ఐ ఆర్థికంగా ఏవిధంగా తోడ్పడ్డాయనే విషయాన్ని హెడ్లీ కోర్టుకు వెల్లడించారు. కోర్టు బయట ఉజ్వల్ నికమ్ మీడియాతో మాట్లాడుతూ.. లష్కరేతోయిబాలో.. మిలటరీ, నేవీ, మహిళ, ఆర్థిక విభాగాలున్నాయని పేర్కొన్నారు.
 
2004లో ఏం జరిగింది?
గుజరాత్‌లోని అహ్మదాబాద్ శివార్లలో 2004 జూన్ 15న ఇష్రత్ జహాన్‌తోపాటు నలుగురిని గుజరాత్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ కేసును విచారించిన సీబీఐ.. బూటకపు ఎన్‌కౌంటర్ అని, క్రైమ్ బ్రాంచ్, ఎస్‌ఐబీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయని 2013లో విడుదల చేసిన చార్జిషీటులో పేర్కొంది. అప్పటి గుజరాత్ అదనపు డీజీపీ, డీఐజీ డీజీ వంజారాతో పాటు ఏడుగురు గుజరాత్ పోలీసు అధికారుల పేర్లను చార్జిషీటులో చేర్చింది.

ఐబీ స్పెషల్ డెరైక్టర్ రాజిందర్ కుమార్‌తోపాటు మరో ముగ్గురు ఐబీ అధికారులను విచారించింది. అయితే ఈ కేసులో తనను ఇరికించాలని చూశారని.. అయినా వారి రాజకీయానికి పావుగా మారలేదని రాజిందర్ కుమార్ గురువారం తెలిపారు. ఎన్‌కౌంటర్లన్నీ రాజకీయ జోక్యం కారణంగానే బూటకంగా మారిపోతాయని డీజీ వంజారా అన్నారు.
 
ఇది సాక్ష్యం కాదు: ఇష్రత్ లాయర్
 అయితే.. హెడ్లీ వెల్లడించిన అంశాలను సాక్ష్యాలుగా పరిగణించలేమని ఇష్రత్ కుటుంబం తరపు న్యాయవాది వృందా గ్రోవర్ అన్నారు. నలుగురు పేర్లు చెబితే.. అందులోనుంచి ఒకరి పేరును హెడ్లీ వెల్లడించటం సాక్ష్యం కాదన్నారు. ఇష్రత్ కుటుంబ సభ్యులు కూడా హెడ్లీ ఆరోపణలను ఖండించారు.

ఈ ఎన్‌కౌంటర్లో మరణించిన ప్రణేశ్ కుమార్ అలియాస్ జావెద్ షేక్ తండ్రి పిళ్లై కూడా.. హెడ్లీ వ్యాఖ్యలపై అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ముంబై దాడుల కేసులో ముగ్గురు కీలక సాక్షులు కోర్టుకు హాజరు కాకపోవటంతో.. తదుపరి విచారణను పాక్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది.
 
సోనియా క్షమాపణలు చెప్పాలి: బీజేపీ

ప్రధాన మంత్రి మోదీపై కోపంతో.. ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్‌ను బూటకంగా చూపించేందుకు కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నించిందని.. తాజాగా హెడ్లీ వాంగ్మూలంతో.. సోనియా, రాహుల్ వ్యాఖ్యలు తప్పని తేలిందని బీజేపీ విమర్శించింది. మోదీపై తప్పుడు ప్రచారం చేసినందుకు సోనియా, రాహుల్ గాంధీ జాతికి క్షమాపణలు చెప్పాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేశారు.
 
హెడ్లీ వ్యాఖ్యలు నమ్మలేం: కాంగ్రెస్
ఇష్రత్ ఎన్‌కౌంటర్‌పై హెడ్లీ వాంగ్మూలంతో.. సోనియా, రాహుల్ క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ డిమాండ్‌ను కాంగ్రెస్ ఖండించింది. హెడ్లీ సాక్షం ఆధారంగా ఇది బూటకపు ఎన్‌కౌంటర్ కాదని నిర్ధారించలేమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా