మహిళా గూఢచారులతో భారత పురుషులకు ఎర!

8 Dec, 2015 15:25 IST|Sakshi
మహిళా గూఢచారులతో భారత పురుషులకు ఎర!

భారత పురుషులకు ఎరవేసేందుకు పాక్ గూఢచార సంస్థ.. ఐఎస్ఐ కొత్త పంథాను ఎంచుకుంది. సోషల్ మీడియా ద్వారా మహిళా గూఢచారులను రంగంలోకి దింపుతోంది. గతంలో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై, ఆ రాష్ట్రంలో ఇతర లక్ష్యాలపై దాడి చేసేందుకు అప్పట్లో నేపాల్ ఐఎస్ఐ ప్రయోగ కేంద్రాలనుంచి మహిళా గూఢచారులను ఇండియాలోకి ప్రవేశపెట్టారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలనే ఆ జిహాదీలు ఆయుధాలుగా వాడుకుంటూ ఇండియాలోని పురుషులకు ఎరవేస్తున్నారు.  

ఇటీవలి కాలంలో మహిళా గూఢచారుల కేసులు వెలుగు చూడటంతో పోలీసు నిఘా ముమ్మరం చేశారు. 2014 ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఫిరోజ్ పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ భారతీయులు కావడం వారి అనుమానాలకు మరింత బలాన్నిచ్చింది. నిందితులను పోలీసులు విచారించగా కొత్త కోణాలు వెలుగుచూశాయి. ఇండో పాక్ చెక్ పోస్టు దగ్గరి గుస్సేన్ వాలా  ప్రాంతాన్నిమహిళా గూఢచారులు రెండుసార్లు సందర్శించినట్లు తెలిసింది. వీరిద్దరినీ విడివిడిగా ట్రాప్ చేసిన ఐఎస్ఐ ఏజెంట్ జయ మిశ్రాతో వీరికి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఇద్దరు నిందితుల్లో ఒకరు మధ్యప్రదేశ్ భోపాల్ జిల్లాకు చెందిన 43 ఏళ్ల శివ్ నారాయణ్ చంద్రవంశం గానూ, మరొకరు 35ఏళ్ల అర్జున్ మాలవ్యగాను గుర్తించారు.

ఈ నిందితులిద్దరూ ఐఎస్ఐ మహిళా ఏజెంట్ జయ మిశ్రాతో ఇంటర్నెట్ లో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిరోజ్ పూర్ పోలీస్ సీనియర్ సూపరింటెండెంట్ చెబుతున్నారు. ఐఎస్ఐ ఏజెంటుగా ఉన్న ఆ మహిళా గూఢచారి లాహోర్ లో ఓ క్లినిక్ నిర్వహిస్తోందని, ఆమె నల్లతేళ్లతో తయారు చేసిన ఔషధాలను సమాజసేవ కోసం వినియోగిస్తోందని పోలీసుల దర్యాప్తులో తేలింది. సో... భారత పురుషులు మహిళల పేర్లు కనిపించగానే కనెక్ట్ అయిపోకుండా సామాజిక మాధ్యమాల్లో  కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే మరి.

మరిన్ని వార్తలు