భారత్‌లో ప్రావిన్స్‌.. ఐసిస్‌ సంచలన ప్రకటన

11 May, 2019 19:40 IST|Sakshi

కశ్మీర్‌ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐసిస్) సంచలన ప్రకటన చేసింది. భారత్‌లో తాము ఓ ‘ప్రావిన్స్’ను ఏర్పాటు చేశామంటూ షాకింగ్‌ న్యూస్‌ వెల్లడించింది. దానికి ‘హిందూ విలయం’గా పేరు పెట్టినట్లు ఐసిస్‌ పేర్కొంది. ఈ విషయాన్ని ఉగ్రవాద సంస్థకు చెందిన అమాఖ్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. కశ్మీర్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇష్ఫాక్ అహ్మద్ సోఫి అనే ఉగ్రవాది హతమైన తర్వాత ఐసిస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంతేకాక షోపియాన్ జిల్లాలోని అమ్షిపొరాలో తాము జరిపిన దాడిలో భారత ఆర్మీకి బాగానే ప్రాణ నష్టం జరిగిందని ఐసిస్‌ పేర్కొంది.

ఐసిస్ చేసిన ప్రావిన్స్ ఏర్పాటు ప్రకటనను ఎస్ఐ‌టీఈ ఇంటెలిజెన్స్ గ్రూప్ డైరెక్టర్ రీటా కట్జ్ కొట్టిపారేశారు. ఈ సంస్థ ఇస్లామిక్ ఉగ్రవాదులను ట్రాక్ చేసే పనిలో ఉంటుంది. అసలు దాని ఉనికే లేని వేళ.. ఐసిస్‌ ఓ ‘ప్రావిన్స్‌’ను ఏర్పాటు చేసినట్టు చెప్పడం పూర్తిగా అసంబద్ధమని ఎస్‌ఐటీఈ పేర్కొంది.

ఇక శుక్రవారం నాటి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సోఫి కశ్మీర్‌లోని పలు ఉగ్రవాద గ్రూపుల్లో దశాబ్దకాలంగా యాక్టివ్‌గా ఉన్నాడు. శ్రీనగర్‌ కేంద్రంగా నడిచే ఓ మేగజైన్‌కు సోఫి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఐసిస్ సానుభూతిపరుడినని పేర్కొన్నట్టు మిలటరీ అధికారి ఒకరు తెలిపారు. సోఫి ఈ ప్రాంతంలో భద్రతా దళాలపై జరిగిన పలు గ్రనేడ్ దాడుల్లో పాల్గొన్నట్టు ఆ అధికారి పేర్కొన్నారు. శుక్రవారం నాటి ఎన్‌కౌంటర్‌లో తమవైపు నుంచి ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదని అధికారి స్పష్టం చేశారు. కశ్మీర్‌లో మిగిలి ఉన్న ఐసిస్ సానుభూతి పరుడు అతడొక్కడేనని, తాజా ఎన్‌కౌంటర్‌లో అతడు కూడా హతమయ్యాడని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు