జమ్మూకశ్మీర్‌లో ఐసిస్‌ అడుగు..

18 Jul, 2017 10:17 IST|Sakshi
జమ్మూకశ్మీర్‌లో ఐసిస్‌ అడుగు..

ఇరాక్‌లో పట్టుకోల్పోతున్న ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌(ఐఎస్‌ఐఎస్‌) భారత్‌లో అడుగుమోపి తన ఉనికి కాపాడుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం కశ్మీర్‌ రాష్ట్రంలోని వేర్పాటువాద ప్రభావిత జిల్లాలను ఎంపిక చేసుకుంది. 'అన్సరుల్‌ ఖలీఫా జమ్మూకశ్మీర్‌' అనే పేరుతో టెలిగ్రామ్‌ గ్రూప్‌ను నిర్వహిస్తున్న ఐసిస్‌.. ఉగ్ర భావజాలాన్ని వ్యాప్తి చేస్తోంది.

కొద్ది వారాల క్రితం జమ్మూకశ్మీర్‌ పోలీసులకు ఫోన్‌ చేసిన ఐసిస్‌ సానుభూతిపరులు ముస్లిం, ఇస్లాం వ్యతిరేకులకు తుపాకులతోనే సమాధానం చెబుతాం అంటూ బెదిరించారు. ఈ నెల 5వ తేదీన కశ్మీర్‌లోని సానుభూతిపరులకు ఉగ్రదాడులు ఎలా చేయాలో ఐసిస్‌ మార్గ నిర్దేశం చేసినట్లు సమాచారం. సోమవారం టెలిగ్రామ్ గ్రూప్‌లో.. భారీ ట్రక్కులతో ఉగ్రదాడులకు ఎలా పాల్పడాలి అనే దానిపై హిందీలో సూచనలు సలహాలు ఐసిస్‌ అందించింది.

బుర్హన్‌ వానీ కాల్చివేత అనంతరం ఐసిస్‌ వైపు మళ్లే వేర్పాటువాద యువత సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా ఐసిస్‌ ఇరాక్‌లోని మోసుల్‌ నగరాన్ని సైన్యానికి కోల్పోయి కకావికలమైంది. తన పేరు తలుచుకుంటే వణికిపోయేలా.. ఎలాగైనా తిరిగి మునుపటి స్ధాయిని అందుకోవాలని అందుకు భారతే మంచి ప్రదేశమని ఐసిస్‌ భావిస్తున్నట్లు తెలిసింది.

అయితే, భారత రక్షణ శాఖ అధికారులు మాత్రం కశ్మీర్‌లో ఐసిస్‌ ఆనవాళ్లను కొట్టిపారేస్తున్నారు. అందుకు ఓ ఈక్వేషన్‌ను చూపుతున్నారు. ఐసిస్‌ భారత్‌లో లేదు కాబట్టే ఇప్పటివరకూ జరిగిన ఉగ్రదాడుల్లో ఒక దాడిని కూడా తాను చేసినట్లు ప్రకటించలేదని అంటున్నారు. కాగా, అన్సరుల్‌ ఖలీఫా పేరుతో ఐసిస్‌కు చెందిన ఉగ్రవాదులు టెలిగ్రామ్‌ గ్రూప్‌ను నిర్వహిస్తున్నారని ఎన్‌ఐఏ ఎప్పటినుంచో అనుమానిస్తోంది.

'అన్సరుల్‌ ఖలీఫా కేరళ' పేరుతో గ్రూపు ప్రారంభించిన ఆరుగురుని కేరళలోని కన్నూరులో ఎన్‌ఐఏ అధికారులు పట్టుకున్నారు. వీరందరూ ఆన్‌లైన్‌లో రాడికలైజ్‌ అయ్యారని సమాచారం. ఆదివారం 'అన్సరుల్‌ ఖలీఫా జమ్మూకశ్మీర్‌' టెలిగ్రామ్‌ గ్రూప్‌లో మరణించిన ఉగ్రవాది సజద్‌ గిల్కర్‌ను కీర్తిస్తూ మెసేజ్‌లు సర్కూలేట్‌ అయ్యాయి.
 

మరిన్ని వార్తలు