తదుపరి లక్ష్యం సూర్యుడే!

10 Aug, 2019 03:02 IST|Sakshi

నాసాతో కలసి పరిశోధనల నిర్వహణకు ఇస్రో సన్నాహాలు

శ్రీహరికోట నుంచి ‘ఆదిత్య–ఎల్‌1’ను పంపేందుకు ప్రణాళికలు

సూళ్లూరుపేట: భారత, అమెరికా అంత రిక్ష పరిశోధనా సంస్థలు (ఇస్రో, నాసా) సంయుక్తంగా సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. గతేడాదే దీనిపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే అమెరికా ఇటీవలే సూర్యుడిపై పరిశోధనలకు సోలార్‌ ప్రోబ్‌ అనే ప్రయోగాన్ని చేపట్టింది. దీని తర్వాత ఇస్రో–నాసా కలిసి మరో ప్రయోగాన్ని చేపట్టేందుకు చర్చలు జరుపుతున్నాయి. శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ–ఎక్స్‌ఎల్‌ రాకెట్‌ ద్వారా ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో హ్యూమన్‌ స్పేస్‌ ప్రోగ్రాం ముందుగానే ప్రయోగించే అవకాశముం టుందని గతంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు.

ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్‌ బిందువు–1 (ఎల్‌–1)లోకి చేరవేస్తారు. అక్కడి నుంచి ఎలాంటి అడ్డంకుల్లేకుండా సూర్యుడిని నిత్యం పరిశీలించడం వీలవు తుందని భావిస్తున్నారు. సూర్యుడి వెలు పలి వలయాన్ని కరోనా అంటారు.  అక్కడ దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుడి అంతర్భాగంలో ఆరు వేల డిగ్రీల కెల్విన్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతుచిక్కడం లేదు. ఈ అంశంపై ఆదిత్య–ఎల్‌1తో పరిశోధనలు చేస్తారు. అన్నీ సమకూరితే 2020 ఆఖరులోపు ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని పలుమార్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు