ఇస్రో భారీ రాకెట్‌

29 May, 2017 00:50 IST|Sakshi
ఇస్రో భారీ రాకెట్‌

►  640 టన్నుల బరువు... 4 టన్నుల ఉపగ్రహాలను మోసుకెళ్లే సామర్థ్యం
► జూన్‌ 5న జీఎస్‌ఎల్‌వీ ఎంకే–3 ప్రయోగం
►  భవిష్యత్తులో భారతీయులను అంతరిక్షంలోకి తీసుకెళ్లే సామర్థ్యం!


న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో సువర్ణాధ్యాయం మొదలుకానుంది. 200 ఆసియా ఏనుగులంత బరువైన అత్యంత భారీ, స్వదేశీ తయారీ రాకెట్‌... జీఎస్‌ఎల్‌వీ ఎంకే–3 (జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ మార్క్‌–3)ని ఇస్రో వచ్చే నెల 5న ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్  అంతరిక్ష కేంద్రంలో ఈ నౌకను ప్రయోగవేదికకు శనివారం విజయవంతంగా అనుసంధానించారు.  ఇప్పటి వరకు భారత్‌ తయారు చేసిన రాకెట్లలో ఇదే అత్యంత భారీది. బరువు 640 టన్నులు. దీని ద్వారా ఇస్రో చరిత్రలోనే భారీ సమాచార ఉపగ్రహమైన 3,200 కిలోల జీశాట్‌–19ను అంతరిక్షంలోకి పంపనున్నారు.

‘ఈ పూర్తిస్థాయి స్వయం ఆధారిత స్వదేశీ రాకెట్‌ తొలి పరీక్షలోనే విజయవంతమవుతుందని ఆశిస్తున్నాం.  రాబోయే పదేళ్లలో అరడజను ఉపగ్రహాల ప్రయోగం తరువాత  అంతరిక్షంలోకి  భారతీయులను తీసుకెళ్లగల సామర్థ్యం దీనికుంది’ అని ఇస్రో చైర్మన్  ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ చెప్పారు.  అయితే ఇందుకు ప్రభుత్వ అనుమతితోపాటు  300  నుంచి 400 కోట్ల డాలర్లు అవసరమని అన్నారు.  ఇస్రో ఇప్పటికే ఇద్దరు లేదా ముగ్గురిని అంతరిక్షంలోకి పంపే ప్రయత్నాల్లో ఉంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే... రష్యా, అమెరికా, చైనాల తరువాత మానవ సహిత అంతరిక్షయాన కార్యక్రమం చేపట్టిన నాలుగో దేశంగా భారత్‌ రికార్డులకెక్కుతుంది.

ఎన్నో ప్రత్యేకతలు... జీఎస్‌ఎల్‌వీ ఎంకే–3 బరువు.. పూర్తిస్థాయిలో నిండిన జంబో జెట్‌ విమానానికి ఐదు రెట్లు అధికం. ఎత్తు 43 మీటర్లు. ఈ  రాకెట్‌... 4 టన్నుల  ఉపగ్రహ శ్రేణులను జియోసింక్రోనస్‌ కక్ష్యలోకి తీసుకెళ్లగలదు. దీని అంచనా వ్యయం రూ.300 కోట్లు. ఇందులోని మల్టిపుల్‌ ఇంజన్లు ఒకే సమయంలో పనిచేస్తాయి.

మరిన్ని వార్తలు