మూన్‌ మిషన్‌ : జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్‌ 2

20 Aug, 2019 14:51 IST|Sakshi

బెంగళూర్‌ : చంద్రయాన్‌-2ను మంగళవారం ఉదయం విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టామని ఇస్రో చీఫ్‌ కే. శివన్‌ వెల్లడించారు. జాబిల్లి కక్ష్యలోకి స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రవేశపెట్టేందుకు చంద్రయాన్‌ 2లో లిక్విడ్‌ ఇంజన్‌ను సిబ్బంది మండించే క్రమంలో అరగంట సేపు ఊపిరి బిగపట్టిన పరిస్థితి నెలకొందని తాము అనుభవించిన టెన్షన్‌ను ఆయన వివరించారు.

చంద్రయాన్‌ 2 సెప్టెంబర్‌ 7న చంద్రుడి వద్దకు చేరడం ఉత్కంఠభరిత సన్నివేశమని శివన్‌ పేర్కొన్నారు. ఇస్రో చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రయోగంగా చంద్రయాన్‌ 2 వినుతికెక్కిన క్రమంలో సెప్టెంబర్‌ 7న మూన్‌ మిషన్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇక మంగళవారం ఉదయం చంద్రయాన్‌ 2 చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించడం​ఈ ప్రయోగ ప్రక్రియలో అత్యంత కీలక దశగా ఇస్రో చీఫ్‌ కే. శివన్‌ అభివర్ణించారు.

దాదాపు 30 రోజుల ప్రయాణం అనంతరం చంద్రుడి చెంతకు చేరనున్న భారత రెండో స్పేస్‌క్రాఫ్ట్‌ మంగళవారం ఉదయం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది.  ఇక సెప్టెంబరు 7న తెల్లవారుజామున అత్యంత చారిత్రాత్మక ఘట్టం ప్రారంభమవుతుందని, 1.40గంటలకు ల్యాండర్‌లో ప్రొపల్షన్‌ ప్రారంభమై 1.55గంటలకు ల్యాండ్‌ అవుతుందని చెప్పారు. 3.10గంటలకు సోలార్‌ ప్యానెళ్లు తెరచుకుని మరోగంటలో అంటే 4 గంటల ప్రాంతంలో రోవర్‌ జాబిల్లి ఉపరితలానికి చేరకుని ఆపరేషన్‌ని ప్రారంభిస్తుందని తెలిపారు. ఆపై జాబిల్లి గుట్టమట్లను ఆవిష్కరించడంతో పాటు అక్కడి వాతావరణంపై పరిశోధన చేపడుతుందని వివరించారు.

మరిన్ని వార్తలు