పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే

23 Jul, 2019 05:08 IST|Sakshi

 ఇస్రో చైర్మన్‌ శివన్‌

శ్రీహరికోట: చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టినందుకు గర్వంగా ఉందని ఇస్రో చైర్మన్‌ డా.కె.శివన్‌ తెలిపారు. ఇందులో ప్రయోగించిన అన్ని సాంకేతిక పరికరాలను భారత్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిందని వెల్లడించారు. ‘సాంకేతిక కారణాలతో ప్రయోగం నిలిచినా మేం మళ్లీ పుంజుకున్నాం. ప్రయోగానికి కొద్దిసేపటి ముందు సమస్యను గుర్తించగానే మా బృందం రంగంలోకి దిగింది. అప్పట్నుంచి 24 గంటల్లోనే సమస్యను పరిష్కరించి చంద్రయాన్‌–2 ప్రయోగానికి సర్వం సిద్ధం చేశాం. జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 చంద్రయాన్‌–2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించడం ఎంతో సంతోషంగా ఉంది.

మేం అనుకున్న దానికంటే 6,000 కి.మీ ఎత్తులో చంద్రయాన్‌–2ను వాహకనౌక విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్‌ చారిత్రాత్మక ప్రయాణం మొదలైంది. కేవలం భారత్‌ ఒక్కటే కాదు. ప్రపంచమంతా చంద్రయాన్‌–2 ప్రయోగం విజయవంతం కావాలని ఎదురుచూసింది. మేం దాన్ని సాధించాం. చంద్రయాన్‌–2 ప్రాజెక్టులో 30 శాతం మంది మహిళా సిబ్బందే ఉన్నారు. వీరిలో శాస్త్రవేత్తలు రీతూ కరిథల్, ఎం వనితలు కీలక పాత్ర పోషించారు. చంద్రయాన్‌–2 ప్రయోగం ఇంకా పూర్తికాలేదు. చంద్రుడిపై ల్యాండర్‌ దిగే 15 నిమిషాలు అత్యంత కీలకమైనవి. ఈ దశను ల్యాండర్‌ దాటితే ప్రయోగం విజయవంతం అయినట్లే. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలందరికీ సెల్యూట్‌ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు