జాబిలమ్మ మీదకు దూసుకెళ్లిన చంద్రయాన్‌–2

22 Jul, 2019 15:10 IST|Sakshi

విజయవంతంగా చంద్రయాన్‌–2 ప్రయోగం

సాక్షి, శ్రీహరికోట : చంద్రుని మూలాలు కనుగొనడానికి ఉద్దేశించి భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌–2ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. 2008 నుంచి చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని పలుమార్లు వాయిదా వేసుకుంటూ వచ్చి జూలై 15న వేకువజామున 2.51 గంటలకు ప్రయోగించాలని అనుకున్న చంద్రయాన్‌–2 మిషన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. వారం రోజులు తిరగకముందే మళ్లీ ప్రయోగానికి సిద్ధమైన శాస్త్రవేత్తలు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగవేదిక నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్‌–2ను ప్రయోగించారు. బయలుదేరిన 16:13 నిమిషాల తర్వాత చంద్రయాన్‌-2 నిర్ణీత కక్ష్యలోకి సమర్థవంతంగా ప్రవేశించింది. కక్ష్యలోకి ప్రవేశించాక వాహన నౌక నుంచి చంద్రయాన్‌-2 ఉపగ్రహం విజయవంతంగా విడిపోయింది. 

ఉపగ్రహాన్ని చంద్రుని దక్షిణ ధృవంలో ప్రవేశపెట్టడం అత్యంత సవాల్‌తో కూడిన పని కాగా.. చంద్రునిపై క్లిష్టమైన సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం ఇస్రో చేస్తున్న మొదటి ప్రయత్నమిది. ఆర్బిటల్‌ నుంచి ల్యాండర్‌, రోవర్‌ విడిపోయాక 15 నిమిషాల అత్యంత కీలకం. రోవర్‌ సెకెన్‌కు ఒక సెంటీమీటర్‌ వేగంతో కదులుతుంది. రోవర్‌ ఒక లూనార్‌ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్‌ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. ఈ 14 రోజుల్లో 500 మీటర్లు దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మాలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది. అయితే ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో భారత్‌ నాలుగోదేశంగా ఖ్యాతి గడించనుంది.

ఇప్పటి దాకా రష్యా, అమెరికా, చైనాకు చెందిన అంతరిక్ష సంస్థలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశారు.  చంద్రయాన్‌–1 పేరుతో ఉపగ్రహాన్ని చంద్రుడికి చుట్టూ పరిభ్రమించేలా చేసిన మొట్ట మొదటి దేశంగా భారత్‌కు పేరుంది. ఇప్పుడు చంద్రయాన్‌–2 పేరుతో ఆర్బిటర్‌ ద్వారా ల్యాండర్‌ను, ల్యాండర్‌ ద్వారా రోవర్‌ను పంపించే నాలుగోదేశంలో అవతరించనుంది. మూడింటిని ఒకేసారి పంపిస్తున్నారు కనుక దీన్ని త్రీ ఇన్‌ వన్‌ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు