టెక్నాలజీల అభివృద్ధికి ఇస్రో పిలుపు

25 Apr, 2020 03:42 IST|Sakshi

బెంగళూరు: భారత్‌ 2022లో చేపట్టనున్న గగన్‌యాన్‌ అంతరిక్ష ప్రయోగానికి అవసరమైన కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రేడియోధార్మికత ప్రభావాలను గుర్తించడం, నివారించడంతోపాటు అంతరిక్షంలో వ్యోమగాముల ఆహారం తదితర 18 అంశాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతలను వాడేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. రెండేళ్ల తరువాత జరిగే గగన్‌యాన్‌ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాములు ఇప్పటికే రష్యాలో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి జాతీయస్థాయి పరిశోధన, విద్యా సంస్థలు కొత్త టెక్నాలజీల తయారీకి దరఖాస్తు చేసుకోవచ్చునని బెంగళూరులోని ఇస్రో కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 15వ తేదీలోగా తమ దరఖాస్తులు పంపాలని కోరింది. అంతరిక్షంలో మనిషి మనగలిగేందుకు కీలకమైన టెక్నాలజీలను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యమని ఆ ప్రకటనలో పేర్కొంది. దరఖాస్తుల పరిశీలన కోసం ఇస్రో ఒక కమిటీ ఏర్పాటు చేస్తుందని, శాస్త్రీయ ప్రయోజనాలు, అవసరం, సాంకేతికత, సాధ్యాసాధ్యాల వంటి అంశాల ప్రాతిపదికన టెక్నాలజీల ఎంపిక ఉంటుందని తెలిపింది.

మరిన్ని వార్తలు