నేడే కక్ష్యలోకి చంద్రయాన్‌–2

20 Aug, 2019 04:15 IST|Sakshi

సూళ్లూరుపేట/బెంగళూరు: ప్రతిష్టాత్మక చంద్రయాన్‌–2 ప్రయోగంలో మరో కీలకఘట్టానికి మంగళవారం వేదిక కానుంది. ప్రస్తుతం లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలో చక్కర్లు కొడుతున్న చంద్రయాన్‌–2 ఉపగ్రహం నేడు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. నేటి ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్యలో చంద్రయాన్‌–2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఉపగ్రహంలోని ద్రవ ఇంధనాన్ని మండించి చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్‌ శివన్‌ వెల్లడించారు. తర్వాత సెప్టెంబర్‌ 2వ తేదీన ఉపగ్రహం నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ విడిపోతుందని తెలిపింది.

బెంగళూరు సమీపంలో గల బైలాలులోని ఇండియన్‌ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ యాంటెన్నాల సాయంతో ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌లోని మిషన్‌ ఆపరేషన్స్‌ కాంప్లెక్స్‌ నుంచి ఉపగ్రహ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇంతవరకు ఉపగ్రహంలోని అన్ని వ్యవస్థలు బాగా పనిచేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది.  చంద్రయాన్‌–2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడం అత్యంత సవాల్‌తో కూడుకున్న విషయమని ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ అన్నారు. చంద్రయాన్‌–2 చంద్రుడి కక్ష్యలోకి చేరుకోనున్న నేపథ్యంలో అధికారులు బెంగళూరులోని అంతరిక్ష కేంద్రం ప్రధాన కార్యాలయంలో మంగళవారం జాతీయ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  గత నెల 22న చంద్రయాన్‌–2ను ప్రయోగించారు.

మరిన్ని వార్తలు