ఇస్రోకు మరో ‘పీఎస్‌ఎల్వీ’ విజయం

30 Nov, 2018 04:24 IST|Sakshi
నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్‌

31 ఉపగ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్వీ–సీ 43

వాటిలో ఒక స్వదేశీ, 30 విదేశీ ఉపగ్రహాలు

శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన గెలుపుగుర్రం పీఎస్‌ఎల్వీతో మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పీఎస్‌ఎల్వీ–సీ43 రాకెట్‌ ద్వారా హైసిస్‌ (హైపర్‌ స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ శాటిలైట్‌) అనే అత్యాధునిక భూ పర్యవేక్షక ఉపగ్రహంతోపాటు ఎనిమిది దేశాలకు చెందిన మరో 30 ఉపగ్రహాలను కూడా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 28 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత గురువారం ఉదయం 9.57 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ–43 రాకెట్‌ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముతూ, మేఘాలను చీల్చుతూ నింగికి దూసుకెళ్లింది.

సరిగ్గా 17 నిమిషాల 27 సెకన్లలో హైసిస్‌ను భూమికి 636.3 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత సూర్యానువర్తన ధృవ కక్ష్యలో ప్రవేశపెట్టింది. అనంతరం మరో గంటలో మిగిలిన 30 ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా వివిధ కక్ష్యల్లోకి చేర్చింది. ఇస్రో చరిత్రలో అత్యంత సుదీర్ఘ సమయం సాగిన ప్రయోగం ఇదే. ఇస్రో అభివృద్ధి చేసిన హైసిస్‌ ఉపగ్రహంతో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఐదేళ్లపాటు ఈ ఉపగ్రహం వ్యవసాయం, అడవులు, భూ సర్వే, భూగర్భ శాస్త్రం, తీర ప్రాంతాలు, దేశీయ జల మార్గాలు, పర్యావరణ పర్యవేక్షణ, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం గుర్తింపు తదితర రంగాల్లో హైసిస్‌ సేవలనందించనుంది.

వైఎస్‌ జగన్‌ అభినందనలు
పీఎస్‌ఎల్‌వీ–సీ 43 ప్రయోగం విజయవంతం అయినందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. భవిష్యత్తులో వారికి అన్నీ విజయాలే చేకూరాలనీ, అంతరిక్షరంగంలో భారతదేశం వెలిగి పోవాలని ఆయన ఆకాంక్షించారు.  

15 రోజుల్లోనే మరో అద్భుత విజయం: శివన్‌
ఇటీవలే భారీ రాకెట్‌ జీఎస్‌ఎల్వీ–మార్క్‌3–డీ2 ద్వారా జీశాట్‌ 29 ఉపగ్రహాన్ని ఇస్రో  ప్రయోగించింది. ఆ తర్వాత 15 రోజుల్లోనే ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ–సీ43 రాకెట్‌ విజయవంతంగా ఉపగ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టడం అద్భుతమని ఇస్రో చైర్మన్‌ శివన్‌ అన్నారు. వచ్చే నెల 5వ తేదీనే ఇస్రో మరో ప్రయోగం చేపడుతోంది. ఫ్రెంచ్‌ గయానా నుంచి జీశాట్‌ 11 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జీశాట్‌–7ఏ ఉపగ్రహాన్ని కూడా డిసెంబర్‌లోనే ప్రయోగించే అవకాశం ఉంది. చంద్రయాన్‌– ఐఐ సహా వచ్చే ఏడాది తామెన్నో ప్రయోగాలను చేయనున్నామన్నారు. గగన్‌యాన్‌ ప్రాజెక్టును వీలైనంత ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానంతో చేపడతామని ఆయన చెప్పారు. గగన్‌యాన్‌ కింద 2020 డిసెంబర్‌ నాటికి మానవ రహిత, 2022 నాటికి మానవసహిత ప్రయోగాలను చేపట్టనున్నామని శివన్‌ వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు