22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 

18 Jul, 2019 02:42 IST|Sakshi

మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగం 

ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్‌ 

శ్రీహరికోట,(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌–2 రాకెట్‌ ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రయోగానికి సంబంధించి ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ వేకువ జామున 2.51 గంటలకు చంద్రయాన్‌–2ను నింగిలోకి పంపాల్సి ఉంది. అయితే రాకెట్‌లో సాంకేతిక లోపాలు తలెత్తిన కారణంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. 56.24 నిమిషాల ముందు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను అర్ధంతరంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.

జీఎస్‌ఎల్‌ మార్క్‌3–ఎం1 రాకెట్‌లోని క్రయోజనిక్‌ దశలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సవరించి మళ్లీ ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. క్రయోజనిక్‌ దశలోని గ్యాస్‌ బాటిల్స్‌ నుంచి ట్యాంకుకు వెళ్లే పైపులు బయట నుంచి లీకేజీ కావడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు 15వ తేదీ రాత్రి నుంచి నిద్రాహారాలు మాని క్రయోజనిక్‌ దశలో ఉన్నటువంటి 25 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్, లిక్విడ్‌ హైడ్రోజన్‌ ఇంధనాన్ని వెనక్కి తీసేశారు. అనంతరం ట్యాంకులోని ఇంధనపు పొరలు తొలగించేందుకు నైట్రోజన్‌ వ్యాపర్స్‌ను లోనికి పంపి క్లీనింగ్‌ చేసే ప్రక్రియను వేగవంతంగా నిర్వహించారు. ఈ సాంకేతిక పరమైన లోపాన్ని పూర్తి స్థాయిలో సవరించి వారం రోజుల గడువులోనే మళ్లీ ప్రయోగానికి సిద్ధం చేయడం ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి నిదర్శనం.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు