చంద్రుడికి మరింత చేరువగా

29 Aug, 2019 03:44 IST|Sakshi

సూళ్లూరుపేట: చంద్రయాన్‌ –2ను చంద్రుడికి దగ్గరగా ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. బుధవారం ఉదయం 9:04 గంటలకు చేపట్టినఈ  ప్రయోగంతో  మూడోసారి కక్ష్యదూరాన్ని తగ్గించినట్లయింది. బెంగళూరు సమీపంలోని బైలాలు భూనియంత్రిత కేంద్రం (మిషన్‌ ఆపరేటర్‌ కంట్రోల్‌ సెంటర్‌) నుంచి ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కే శివన్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు దీన్నిపూర్తి  చేశారు. చంద్రుడికి దగ్గరగా 118 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ సారి  చంద్రుడికి దగ్గరగా 179 కిలోమీటర్ల ఎత్తుకు పెంచుకుంటూ పోయి చంద్రుడికి దూరంగా 4,412 కిలోమీటర్లు ఎత్తును 1412 కిలోమీటర్లు ఎత్తుకు తగ్గిస్తూ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లను చంద్రుడికి దగ్గరగా తీసుకొచ్చే ప్రక్రియ పూర్తయింది.

చంద్రయాన్‌–2 మిషన్‌ భూమధ్యంతర కక్ష్యలో ఉన్నప్పుడు కక్ష్య దూరాన్ని పెంచుకుంటూ పోతే, లూనార్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశించాక కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ రావడం చంద్రయాన్‌–2 ప్రయోగంలో విశేషం. లూనార్‌ ఆర్బిట్‌లో చంద్రుడికి దగ్గరగా 179 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 1412  కిలోమీటర్ల ఎత్తులో దీర్ఘవృత్తాకారంలో ఆర్బిటర్‌ చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోంది. లూనార్‌ ఆర్బిట్‌లో కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ వచ్చి చంద్రుడికి దగ్గరగా 30 కిలోమీటర్లు, దూరంగా 100 కిలోమీటర్లు చేరుకోవడం కోసం మరోమారు ఆపరేషన్‌ చేపట్టేందుకు ఇస్రోశాస్త్రవేత్తలు సంసిద్ధమవుతున్నారు. ఈ నెల 30న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కక్ష్య దూరాన్ని మరోమారు తగ్గించే ప్రక్రియను చేపట్టనున్నట్టు ఇస్రో బుధవారం ప్రకటించింది.

>
మరిన్ని వార్తలు