చంద్రుని దక్షిణ ధ్రువంపైకి రోవర్‌

4 May, 2019 04:46 IST|Sakshi

ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ వెల్లడి

సాక్షి ప్రతినిధి, చెన్నై/శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్‌–2 ప్రాజెక్టును ఈ ఏడాది జూలై 9వ తేదీ నుంచి 16వ తేదీల మధ్యలో ప్రయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చంద్రుని దక్షిణ ధ్రువంపైకి ఇస్రో ల్యాండర్, రోవర్‌లను పంపనుంది. ‘ఇప్పటి వరకు ఎవరూ కూడా చీకటిగా ఉండే ఈ ప్రాంతంలోకి రోవర్‌ను దించలేదు. చంద్రుని ఈక్వేటర్‌కు సమీపంలోకి ఇది వెళ్తుంది’ అని ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ తెలిపారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 రాకెట్‌ ద్వారా ప్రయోగించే ఉపగ్రహంలో ల్యాండర్‌ విక్రమ్, రోవర్‌ ప్రజ్ఞాన్‌ ఉంటాయి.

ఇవి సెప్టెంబర్‌ నాటికి అక్కడికి చేరుకుంటాయని ఆయన వివరించారు. వీటి ద్వారా తాము సేకరించే సమాచారంపై ప్రపంచ నలుమూలలా ఉన్న శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రయోగాలన్నిటినీ పూర్తి చేసి 2022లోగా చంద్రునిపైకి మానవుడిని పంపుతామని ఇస్రో చైర్మన్‌ తెలిపారు. దీంతోపాటు వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో సూర్యుడిపై ప్రయోగాల కోసం ఆదిత్య–ఎల్‌1 సూర్యుని కక్ష్యలోకి ప్రయోగిస్తామని తెలిపారు. ఈ ప్రయోగం వల్ల సూర్యుని గురించి ఇంతవరకు తెలియని అనేక విషయాలను తెలుసుకుంటామని చెప్పారు. ఇతర గ్రహాలపైనా పరిశోధనలు చేపట్టేందుకు ఇస్రో సమాయత్తం అవుతోందని తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు