ఫొటో వైరల్‌: ఇది అతిపెద్ద ఫోబోస్‌

4 Jul, 2020 13:53 IST|Sakshi

బెంగళూరు:‌ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆరేళ్ల క్రితం అంగారక గ్రహంపైకి పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఇప్పటికీ విజయవంతం పనిచేస్తోంది. అంతరిక్షంలో అరుదైన చిత్రాన్ని తాజాగా ‘మామ్‌’ తన కెమెరాలో బంధించింది. అంగారక గ్రహం రహస్య చంద్రుడిగా వ్యవహరించే ‘ఫోబోస్‌’ అరుదైన ఫొటోను మార్స్ కలర్ కెమెరా (ఎంసీసీ) సంగ్రహించింది. అంగారక గ్రహం నుంచి 7,200 కి.మీ. ఫోబోస్ నుంచి 4,200 కి.మీ. దూరంలో ఉన్నప్పుడు ఎంసీసీ ఈ ఫొటో తీసిందని ఇస్రో వెల్లడించింది. ‘ఈ ఫోటో ప్రాదేశిక రిజల్యూషన్ 210 ఎం. ఇది 6 ఎంసీసీ ఫ్రేమ్‌ల నుంచి ఉత్పత్తి చేయబడిన మిశ్రమ చిత్రం. రంగు సరిదిద్దబడింద’ని ఇస్రో తెలిపింది. అంగార గ్రహానికి అతి సన్నిహితంగా, పెద్దగా ఉన్న చంద్రుడిగా పిలవబడే ఫోబోస్‌.. కార్బోనేషియస్ కొండ్రైట్లతో నిండివుంటుందని వెల్లడించింది.

2014 సెప్టెంబర్‌ 24న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను విజయవంతంగా ఇస్రో ప్రయోగించింది. మొదటి ప్రయత్నంలోనే అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన తొలి ఆసియా దేశంగా భారత్ అప్పట్లో రికార్డు సృష్టించింది. తొమ్మిది నెలలపాటు అంతరిక్షంలో మామ్ సుమారు 650 మిలియన్ల కిలోమీటర్లు ప్రయాణించి అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. (టెక్నాలజీల అభివృద్ధికి ఇస్రో పిలుపు)

>
మరిన్ని వార్తలు