సక్సెస్‌ అయితే.. నాసా కంటే ఇస్రోనే తోపు

17 Feb, 2018 12:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : అంతరిక్ష ప్రయోగ చరిత్రలో చంద్రయాన్‌-2ను ఓ మరుపురాని ప్రాజెక్టుగా మార్చేందుకు భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (ఇస్రో) సిద్ధమైపోయింది. సుమారు 800 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సిద్ధం చేస్తున్న ఈ ప్రాజెక్టును ఏప్రిల్‌లో ప్రయోగించాలని నిర్ణయించుకుంది. నాసో అపోలో మిషన్ల కన్నా చంద్రయాన్‌-2 చాలా శక్తివంతమైందని కేంద్ర మంత్రి(అంతరిక్ష వ్యవహారాల శాఖ ఇన్‌ఛార్జి మంత్రి) జితేంద్ర సింగ్‌ చెబుతున్నారు. ప్రయోగానికి సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు.

 ‘ఇస్రో ఇప్పటిదాకా చేపట్టిన ప్రయోగాలలో చంద్రయాన్‌-2 ప్రత్యేకంగా నిలవబోతోంది. ప్రపంచంలోనే ఓ అద్భుత ఘట్టంగా దీనిని తీర్చిదిద్దేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిపై నిశితంగా స్పేస్‌ క్రాఫ్ట్‌లను ల్యాండ్‌ చేయటంలో విజయవంతం అయ్యాయి. ఇప్పుడు భారత్‌ గనక ఆ ఘనత సాధిస్తే ఇస్రో చరిత్ర సృష్టించినట్లే. ఎందుకంటే నాసా(అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ) కంటే ఇస్రో 20 రేట్లు తక్కువ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్టును ప్రయోగించబోతోంది’ అని జితేంద్ర వెల్లడించారు. 

చంద్రుడి మీద దక్షిణ దృవంలో చంద్రయాన్‌-2 ల్యాండ్‌ అయ్యే దిశగా ఇస్రో ప్రణాళికలు చేస్తోంది. 2008లో చంద్రయాన్‌-1 ప్రయోగం విజయవంతం కాగా, 2009లో నీటి జాడలు ఉన్నట్లు స్పేస్‌ క్రాఫ్ట్‌ గుర్తించింది. ఈ విజయం నింపిన ఉత్సా హంతో ఇప్పుడు మరో భారీ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సిద్ధమవుతున్నది. 

ప్రయోగం ఎలా సాగుతుందంటే...
చంద్రయాన్-2 వ్యోమనౌక,ల్యాండర్,రోవర్.. ప్రధాన,ఉప వ్యవస్థల అనుసంధానాలు అవుతాయి. చంద్రయాన్-1 లా కాకుండా వ్యోమనౌక నెమ్మదిగా దిగేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు. దీని ప్రకారం వ్యోమనౌకను 100 మీటర్ల ఎత్తునుంచి కిందకు జార విడుస్తారు. వ్యోమనౌక కక్ష్య నుంచి రోవర్‌ చంద్రునిపై కుప్పకూలకుండా నెమ్మదిగా వాలేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందందని సైంటిస్టులు భావిస్తున్నారు. ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం 100 మీటర్ల ఎత్తులో చంద్రమండలంలోని గురుత్వాకర్షణ వాతావరణాన్ని సృష్టిస్తారు. 500 కిలో గ్రాముల బరువైన వ్యోమనౌకను మండించడం ద్వారా కిందకు శాటిలైట్‌ను జారవిడుస్తారు. నౌక దిగాల్సిన దగ్గర రాళ్లు,బండలు ఉంటే మరో సురక్షిత స్థానాన్ని గుర్తించి అక్కడ దిగేందుకు అడ్డం-నిలువు విన్యాసాలు సాయపడుతాయన్నారు. ప్రస్తుతం వ్యోమనౌక సమర్ధతను తమిళనాడు మహేంద్రగిరి ఇస్రో ఇందన కేంద్రంలో పరీక్షిస్తున్నారు. చంద్రునిపై రోవర్‌.. ఖనిజ వనరులు, మూలకాల్ని, మానవ జాతి మనుగడకు గల సాధ్యాసాధ్యాలను పరీక్షిస్తుంది.

మరిన్ని వార్తలు