నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46

22 May, 2019 06:51 IST|Sakshi

సాక్షి, శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి నింగిలోకి పీఎస్‌ఎల్వీ సీ-46 వాహక నౌక దూసుకెళ్లింది. 615 కిలోల బరువు గల రీశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ46 వాహక నౌక 557 కి.మీ ఎత్తులోని కక్షలోకి ప్రేవేశపెట్టింది. దీంతో పీఎస్‌ఎల్‌వీ-సీ46 ప్రయోగం దిగ్విజయమైంది. 

షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 5.30 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-46ఉపగ్రహ వాహక నౌకను శాస్త్రవేత్తలు రోదసీలోకి పంపారు. ఇందుకు సంబంధించి మంగళవారం తెల్లవారుజామున 4.30గంటలకు కౌంట్‌ డౌన్‌ను ప్రారంభమయ్యింది. 

44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగ సమయంలో 290 టన్నుల బరువుతో ప్రయాణం ప్రారంభమైంది. 139 టన్నుల ఘన ఇంధనంతో 1.50 నిమిషాలకు పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 41 టన్నుల ద్రవ ఇంధనంతో 4.22 నిమిషాలకు రెండోదశ, 7.65 టన్నుల ఘన ఇంధనంతో 9.23 నిమిషాలకు మూడోదశ, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 14.42 నిమిషాలకు నాలుగోదశ పూర్తి చేసిన అనంతరం 15.29 నిమిషాలకు 615 బరువు కలిగిన రిశాట్‌–2బీఆర్‌1 ఉపగ్రహాన్ని భూమికి 557 కిలోమీటర్ల ఎత్తులోని సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లో 37 డిగ్రీల అక్షాంశంలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం అయిదేళ్ల పాటు అంతరిక్షంలో ఉండి సేవలు అందిస్తుంది. పీఎస్‌ఎల్వీ ప్రయోగాలలో ఇది 48వ ప్రయోగం. రీశాట్‌ 2 బీఆర్‌1 ఉపగ్రహం సరిహద్దుల్లో ఉగ్రశిబిరాలు, కదలికలను పసిగట్టనుంది. అలాగే ప్రకృతి వైపరిత్యాలపై అధ్యయనం చేస్తుంది. 

ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్‌ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందలు తెలిపారు. బుధవారం ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ-46 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా