విజయవంతంగా నింగిలోకి..

13 Apr, 2018 02:21 IST|Sakshi
నింగిలోకి దూసుకెళ్తున్న పీఎస్‌ఎల్‌వీ–సీ41 రాకెట్‌

కక్ష్యలోకి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1ఐ ఉపగ్రహం

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు

శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1ఐ నేవిగేషన్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. సతీష్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రం(షార్‌) నుంచి గురువారం తెల్లవారుజామున 4.04 గంటలకు పీఎస్‌ఎల్వీ–సీ41 వాహకనౌక ద్వారా 1425 కేజీలున్న ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. అమెరికాకు చెందిన జీపీఎస్, రష్యాకు చెందిన గ్లోనాస్, యూరప్‌కు చెందిన గెలీలియో తరహాలో భారత్‌లో పౌర, సైనిక అవసరాలకు నావిక్‌(దీన్ని ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌గానూ వ్యవహరిస్తున్నారు) అనే దేశీయ దిక్సూచీ వ్యవస్థను ఇస్రో అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా ఏడు ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. నావిక్‌ దిక్సూచీ వ్యవస్థ పనిచేయాలంటే కనీసం ఏడు ఉపగ్రహాలు అవసరమవుతాయి.

అయితే ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1ఏ ఉపగ్రహంలోని రుబీడియమ్‌ అణు గడియారాలు పనిచేయకపోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా గతేడాది ఆగస్టులో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1హెచ్‌ను ఇస్రో ప్రయోగించింది. కానీ ఆ ఉపగ్రహానికున్న షీట్‌షీల్డ్‌ తెరుచుకోకపోవడంతో ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇస్రో తాజాగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1ఐ ఉపగ్రహాన్ని భూ బదిలీ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ప్రయోగం అనంతరం హసన్‌లోని మాస్టర్‌ కంట్రోల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు ఉపగ్రహం నియంత్రణను తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం 284 కి.మీ పెరిజీ(భూమికి దగ్గరగా), 20,650 కి.మీ అపోజీ(భూమికి దూరంగా) ఎత్తులో భూబదిలీ కక్ష్యలో ఉన్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1ఐ ఉపగ్రహంలోని ఇంధనాన్ని దశలవారీగా మండించి 36,000 కి.మీ ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు.

పదేళ్ల పాటు సేవలు
బెంగళూరుకు చెందిన ప్రైవేటు సంస్థ ఆల్ఫా డిజైన్‌ టెక్నాలజీస్, ఇస్రోలు సంయుక్తంగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1ఐ ఉపగ్రహాన్ని నిర్మించాయి. ఈ ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. ఇస్రో అభివృద్ధి చేసిన నావిక్‌ దిక్సూచీ వ్యవస్థ సాయంతో దేశమంతటా వాహనాలు, నౌకలు, విమానాలకు దిశానిర్దేశం చేయవచ్చు. అంతేకాకుండా ఈ వ్యవస్థను సైనిక అవసరాలకూ వాడుకోవచ్చు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1హెచ్, 1ఐ ఉపగ్రహాలను ఇస్రో ఆల్ఫా డిజైన్‌ టెక్నాలజీస్‌ అనే ప్రైవేటు సంస్థతో కలసి నిర్మించింది. ఇస్రో ఇప్పటివరకూ 43 సార్లు పీఎస్‌ఎల్వీ వాహకనౌకలను ప్రయోగించగా.. అందులో 41 సార్లు విజయం సాధించింది.

శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందనలు
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1ఐ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. నావిక్‌ దిక్సూచీ వ్యవస్థతో దేశంలోని సామాన్యులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. నావిక్‌ వ్యవస్థతో సరికొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయని ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ మీడియాకు తెలిపారు. దీనివల్ల దేశవ్యాప్తంగా తీరప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. త్వరలోనే నావిక్‌ ఆధారిత యాప్‌లను విడుదల చేస్తామనీ, దీన్ని పరిశ్రమలు, విద్యాసంస్థలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ ఏడాది ఇస్రో చరిత్రలోనే అత్యంత భారీ ఉపగ్రహమైన జీశాట్‌–11 (5,725 కేజీలు)ను ఫ్రెంచ్‌ గయానా నుంచి ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ప్రధానంగా భారీ ప్రయోగాలపైనే దృష్టి సారించినట్లు శివన్‌ చెప్పారు.

రాకెట్‌ బరువు    :    321 టన్నులు
ఎత్తు    :    44.4 మీటర్లు
దశలు    :    4 (ఘన, ద్రవ)
ఉపగ్రహంబరువు    :    1,425 కేజీలు
పరిమాణం    :    1.58 మీటర్లు గీ     1.5 మీటర్లు గీ 1.5 మీటర్లు
సామర్థ్యం    :    1,670 వాట్లు

మరిన్ని వార్తలు