కర్ణాటక కాంట్రాక్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు

25 Apr, 2018 02:04 IST|Sakshi

బెంగళూరు/న్యూఢిల్లీ: త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఆదాయ పన్ను (ఐటీ) శాఖ కొరడా ఝళిపించింది. పన్ను ఎగవేత కేసుల దర్యాప్తులో భాగంగా మైసూరు, బెంగళూరు నగరాల్లోని 11 మంది కాంట్రాక్టర్ల ఇళ్లలో సోదాలు చేపట్టింది. ఈ కాంట్రాక్టర్లు ప్రభుత్వ టెండర్లలో పాల్గొని వివిధ ప్రజోపయోగ పనులను చేయిస్తుంటారని ఐటీ అధికారులు తెలిపారు.

గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో వీరి చెల్లింపులను అంతకుముందు ఏడాది చెల్లింపులు, బ్యాంకు లావాదేవీల్లో తీవ్రమైన వ్యత్యాసాలున్నాయని చెప్పారు. ఇటీవల రాష్ట్రానికి చెందిన ఓ కాంట్రాక్టర్‌ ఒక వ్యక్తికి రూ.55 లక్షల నగదును ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేయటం, సదరు వ్యక్తి ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోవటం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ డబ్బును సీజ్‌ చేసి, సంబంధిత కాంట్రాక్టర్‌ను విచారించగా మరో రూ.16 కోట్ల నగదును దాచి పెట్టినట్లు ఒప్పుకున్నాడన్నారు.   

మంత్రి నివాసంపై ఐటీ దాడులు?
సాక్షి, బెంగళూరు/ మైసూరు: సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితుడు, ప్రజాపనుల మంత్రి మహదేవప్ప నివాసం, కార్యాలయంపై ఐటీ దాడులు జరిగాయి. బెంగళూరుతో పాటు మైసూరులోని విజయనగర, టి.నరసీపురలోనున్న ఇళ్లలో సోదాలు జరిగాయని వార్తలు వచ్చాయి.

ఎన్నికల్లో పంచడానికి భారీగా నగదు దాచి ఉంచినట్లు ఫిర్యాదులు రావడంతో మంత్రి మహదేవప్ప నివాసంతోపాటు ఆయనకు పరిచయస్తులైన 25 మంది కాంట్రాక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. అయితే తన ఇంటిపై ఐటీ దాడులేవీ జరగలేదని, కొందరు కాంట్రాక్టర్ల ఇళ్లలో సోదాలు జరిపినట్లు తెలిసిందని మంత్రి చెప్పారు. ఐటీ దాడులు ప్రధాని మోదీ దురుద్దేశంతో చేయిస్తున్నారని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.   

మరిన్ని వార్తలు