అన్ని సంస్థల్లో ఉద్వాసనల పర్వం...

10 May, 2017 21:46 IST|Sakshi
అన్ని సంస్థల్లో ఉద్వాసనల పర్వం...

త్రిముఖ పరిణామాలతో భారత ఐటీ పరిశ్రమ కీలకమైన సంధి దశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా స్థానిక పని పరిస్థితులు మారిపోతున్నాయని ఐటీ పరిశ్రమలు గుర్తిస్తున్నాయి. అందుకు అనుగుణంగా తమను తాము మార్చుకునే క్రమంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఆ ప్రభావం ప్రధానంగా ఉద్యోగుల మీద పడుతోంది. లాభాలు తగ్గిపోయి నష్టాల బారిన పడకుండా చూసుకోవడం, ఆయా దేశాల విధానాలకు అనుగుణంగా స్థానిక నియామకాలకు పెద్దపీట వేయడం, సాంకేతికాభివృద్ధిలో భాగంగా ఆటోమేషన్ను అందిపుచ్చుకోవడం.. ఐటీ పరిశ్రమకు అనివార్యంగా మారింది.

ఈ క్రమంలో భారతదేశంలోను, విదేశాల్లోను భారతీయ ఉద్యోగులను తగ్గించుకోవడం మొదలైందని, ఈ ఉద్వాసనలు మున్ముందు ఇంకా పెరిగే అవకాశముందని, కొత్త నియామకాలు తగ్గిపోతాయని ఐటీ రంగ ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే భారత ఐటీ పరిశ్రమ 2016-17లో 39 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది. ఉద్యోగుల సంఖ్య వార్షిక పెరుగుదల ఐదు శాతంగా నమోదైనట్లు నాస్కామ్ వివరించింది. అంతకుముందు ఏడాది ఆరు శాతం కన్నా ఇది తక్కువే. మున్ముందు కొత్త ఉద్యోగుల నియామకం ఇంకా తగ్గిపోతుందని చెప్తున్నారు.

దేశంలో మూడో అతి పెద్ద సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ సంస్థ అయిన విప్రో 600 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఆ సంఖ్య 2 వేల వరకూ పెరగవచ్చునని చాలా మంది చెప్తున్నారు. విప్రో ఆదాయం పెరగకపోతే ఈ ఏడాది సుమారు 10 శాతం మంది సిబ్బందిని తొలగిస్తామని సంస్థ సీఈఓ అబీద్ అలీ నీముచ్వాలా నెల రోజుల కిందట అంతర్గత సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ గత వారంలో.. డైరెక్టర్లు, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు వంటి సంస్థ ఉన్నత స్థాయి ఉద్యోగులకు స్వచ్ఛందంగా వైదొలగాలని సూచిస్తూ ప్యాకేజీలు ప్రతిపాదించింది.

దీనికి ప్రధాన కారణం.. సంస్థ కార్యకలాపాలను ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీలకు మార్పు చేసే ప్రణాళికేనని చెప్తున్నారు. కనీసం వెయ్యి మంది సీనియర్ ఉద్యోగులు వైదొలగుతారని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కనీసం మరో 6 వేల మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసినట్లు చెప్తున్నారు. ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగుల తొలగింపుకు శ్రీకారం చుట్టింది. లెవల్-6 ఉద్యోగులు, ఆపై స్థాయి ఉద్యోగులు అంటే గ్రూప్ ప్రాజెక్ట్ మేనేజర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, సీనియర్ ఆర్కిటెక్ట్లు, ఆపై స్థాయి ఉద్యోగులు వెయ్యి మందికి ఉద్వాసన పలికేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.

ఈ ఉద్యోగుల్లో పనితీరు ప్రాతిపదికన తక్కువ రేటింగ్ ఉన్న 10 శాతం మందిని గుర్తించాలని ఆ స్థాయిల్లోని మేనేజర్లకు నిర్దేశించినట్లు సమాచారం. ఇన్ఫోసిస్ కొత్త నియామకాల్లో కూడా 60 శాతం కోత పెట్టింది. క్యాప్జెమిని సంస్థ దాదాపు 9,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్తున్నారు. అది ఆ సంస్థ మొత్తం ఉద్యోగుల్లో ఐదు శాతం. ఇందులోనూ క్యాప్జెమిని 2015లో కొనుగోలు చేసిన ఐగేట్ మాజీ ఉద్యోగుల మీద ముందుగా వేటు పడుతుందని చెప్తున్నారు. ఇప్పటికే 35 మంది వీపీలు, ఎస్వీపీలు, డైరెక్టర్లు, సీనియర్ డైరెక్టర్లతో పాటు 200 మంది ఉద్యోగులను వైదొలగాల్సిందిగా ఆ సంస్థ నిర్దేశించింది.

నాటి మాంద్యం కన్నా ఎక్కువ ప్రభావం..
అయితే గత రెండు దశాబ్దాలుగా 20 శాతానికి పైగా వస్తున్న భారత ఐటీ పరిశ్రమల లాభాలు తగ్గుతాయే కానీ.. ఆ పరిశ్రమలు పూర్తిగా దెబ్బతినబోవని నిపుణులు చెప్తున్నారు. కానీ.. భారత మధ్య తరగతి యువత ఐటీ కలలు, విదేశీ ఉద్యోగాల ఆశలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇప్పటికే ఆటోమేషన్, ఇతరత్రా కారణాలతో మందగించిన కొత్త ఉద్యోగుల నియామకం మరింత మందగిస్తుంది. 2008-2010 మధ్య మాంద్యంలో తొలగింపుల కన్నా అధికంగా ఈ ఏడాది ఐటీ ఉద్యోగుల ఉద్వాసన ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. మధ్యశ్రేణి, సీనియర్ స్థాయి ఉద్యోగుల మీద తొలి దెబ్బ పడుతుందని, ఈ ఏడాది రెండో అర్థ భాగంలో జూనియర్ ఉద్యోగుల్లో కూడా భారీగా కోతలు పడవచ్చునని అంచనా వేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు