స్వాతంత్య్రానికి ప్రత్యామ్నాయం కాదు!

4 Apr, 2017 02:09 IST|Sakshi
స్వాతంత్య్రానికి ప్రత్యామ్నాయం కాదు!

మోదీ ‘పర్యాటక’ వ్యాఖ్యలపై కశ్మీరీ సంస్థల స్పందన

శ్రీనగర్‌: కశ్మీరీ యువత ఉగ్రవాదమో, పర్యాటకమో తేల్చుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను విపక్షాలతోపాటు, పలు కశ్మీర్‌ వేర్పాటువాద సంస్థలు తీవ్రంగా దుయ్యబట్టాయి. కశ్మీరీ యువత కోరుకుంటున్న స్వాతంత్య్రాన్ని రోడ్లు, టన్నెల్‌ల ద్వారా ఇవ్వలేరని మండిపడ్డాయి. ‘మోదీ వ్యాఖ్యలు అర్థరహితం. కశ్మీర్‌ లోయలో భారత సైనికుల ఉగ్రవాదం నుంచి విముక్తిని ఇక్కడి యువత కోరుకుంటున్నారు’ అని జమ్మూకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ ముహ్మద్‌ యాసిన్‌ మాలిక్‌ విమర్శించారు.

ప్రపంచంతో పోటీపడగలిగే సామర్థ్యమున్నా భారత ప్రభుత్వ అణచివేత కారణంగానే కశ్మీరీ యువత వెనుకబాటుకు గురైందని మిర్వాయిజ్‌ ఫోరం మండిపడింది. ‘కశ్మీర్‌ సున్నితమైన రాజకీయాంశం. గంభీరమైన ఏడు దశాబ్దాల ఈ సమస్యను పరిష్కరించేందుకు అసాధారణమైన ధైర్యం కావాలి. చారిత్రాత్మకమైన కశ్మీర్‌ సమస్యను మోదీ రాజకీయ చతురతతో పరిష్కరించాలి తప్ప.. రోడ్లు, టన్నెల్స్‌ నిర్మాణం ద్వారా కాదు’ అని ఆల్‌పార్టీ హురియత్‌ కాన్ఫరెన్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

>
మరిన్ని వార్తలు