ఐటీ + ఐటీ= ఐటీ

11 May, 2017 00:47 IST|Sakshi
ఐటీ + ఐటీ= ఐటీ

రేపటి భారతానికి ప్రధాని సరికొత్త ఫార్ములా
► మైండ్‌ మారకపోతే మార్పు జరగదు
► అన్ని వర్గాలూ సాంకేతికతను అలవర్చుకోవాలి
► సుప్రీంకోర్టులో ‘సమగ్ర కేసు సమాచార నిర్వహణ’ ప్రారంభోత్సవంలో ప్రధాని
► సరికొత్త వ్యవస్థతో పారదర్శకత పెరుగుతుందన్న సీజేఐ


న్యూఢిల్లీ: భవిష్యత్‌ భారతావనికి ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త నిర్వచనాన్నిచ్చారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), ఇండియన్‌ టాలెంట్‌ (ఐటీ) కలిస్తే ఇండియా టుమారో (ఐటీ) సాధ్యమవుతుందన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేసుల డిజిటల్‌ ఫైలింగ్‌ కోసం సుప్రీంకోర్టులో ‘సమగ్ర కేసు నిర్వహణ సమాచార వ్యవస్థ’ను బుధవారం ప్రధాని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. భారతీయుల మేధస్సుకు సాంకేతికతను జోడించటం వల్ల భవిష్యత్‌ భారతాన్ని దర్శించొచ్చన్నారు. ‘సరికొత్త సాంకేతికతను కొంచెం కొంచెంగా కాకుండా ఒకేసారి అందిపుచ్చుకోవాల్సిన అవసరం దేశానికి ఉంది. సరైన సాంకేతిక లాభాలు కనిపించాలంటే.. సమాజంలోని అన్ని వర్గాలు సాంకేతికతను ఒంటబట్టించుకోవాలి. కొందరికే ఈ సాంకేతికత పరిమితమైతే లాభం ఉండదు’ అని మోదీ వెల్లడించారు.

పని సంస్కృతికి అనుగుణంగా ఆలోచన
మైండ్‌సెట్‌ సమస్యను కూడా మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘పాత మైండ్‌సెట్‌ మారాలి. సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు ఎంత అటోమేషన్‌ తీసుకొచ్చినా.. మైండ్‌సెట్‌ మారకపోతే ఏమీ జరగదు’ అని మోదీ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో çపూల కుండీలు స్థానంలో కంప్యూటర్లు వచ్చాయని.. ఇప్పటికీ వీటిని షో పీసులుగానే వాడుతున్నారని మోదీ తెలిపారు. ‘ఇదీ మైండ్‌సెట్‌ సమస్య’ అన్నారు.  దేశంలో మారుతున్న పనిసంస్కృతికి అనుగుణంగా మన ఆలోచన విధానం కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. వేసవిసెలవుల్లోనూ కేసులు విచారించేందుకు న్యాయవ్యవస్థ ముందుకు రావటం చాలా గొప్ప నిర్ణయమని మోదీ ప్రశంసించారు.

న్యాయవ్యవస్థ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు అవసరమైన బలాన్ని అందిస్తుందన్నారు. సమగ్ర కేసు నిర్వహణ సమాచార వ్యవస్థ ద్వారా కక్షిదారులు కేసుకు సంబంధించిన వివరాలను పొందటంతోపాటు ఆన్‌లైన్‌లోనే కేసుకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చని మోదీ తెలిపారు. దీని ద్వారా సుప్రీంకోర్టు కార్యకలాపాలు కాగితరహితంగా మారేందు కు ఒక అడుగు ముందుకు పడుతుందన్నారు. ఈ వ్యవస్థను సుప్రీం వెబ్‌సైట్‌లో మోదీ అప్‌లోడ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ ట్యాగ్‌లైన్‌ అయిన ‘దేశ్‌ బదల్‌ రహాహై’ (దేశం మారుతోంది) పదాన్ని మోదీ గుర్తుచేశారు.

‘దేశం మారుతోంది. ఈ రోజు సెలవుంది (బుధవారం బుద్ధపౌర్ణమి). అయినా మేం పనిచేస్తున్నాం’ అని మోదీ అన్నారు. తన సూచన మేరకు చాలామంది గైనకాలజిస్టులు ప్రతినెలా 9న పేద గర్భిణులకు ఉచితవైద్యం అందిస్తున్నారని.. అలాగే న్యాయవాదులు కూడా పేదల కేసులను ఉచితంగా వాదించేందుకు ‘ప్రొ బోనో’ పథకంలో చేరాలని మోదీ కోరారు.

సుప్రీంకోర్టులో వైఫై ఎందుకొద్దు?: అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌లో వైఫై ఉన్నప్పుడు భారత సుప్రీం కోర్టులో మాత్రం వైఫై సదుపాయం ఎందుకు ఉండకూడదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ ప్రశ్నించారు. ‘సుప్రీంకోర్టు ప్రాంగణంలో వైఫై సదుపాయం లేదు. వైఫై ఉంటే సుప్రీంకోర్టు భద్రతకు ముప్పువాటిల్లుతుందని, సమాచారం బయటకు పొక్కుతుందని ఎవరో మాజీ సీజేఐకి చెప్పారు’ అని చలమేశ్వర్‌ తెలిపారు. కేసుల ఫైలింగ్‌కు సంబంధించిన ఈ డిజిటైజ్డ్‌ వ్యవస్థ.. 20 ఏళ్ల క్రితం జరిగిన  సుప్రీంకోర్టు కంప్యూటరీకరణ తర్వాత ఓ కీలకమైన పరిణామంగా పేర్కొన్నారు.

పారదర్శకత కోసమే
కేసుల డిజిటల్‌ ఫైలింగ్‌ ద్వారా పారదర్శకత పెరుగుతుందని సీజేఐ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 24 హైకోర్టుల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత కిందికోర్టులోనూ ఈ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ‘ఈ వ్యవస్థ ద్వారా కక్షిదారు తన జీవితంలో ఒక కేసు మాత్రమే వేసేందుకు వీలుంటుంది. ఈ వ్యవస్థను అతిక్రమించే అవకాశమే లేదు. ఇందులో అప్‌లోడ్‌ చేసిన దస్తావేజులను వక్రీకరించే అవకాశమే ఉండదు. ఈ రికార్డులను భద్రపరిచేందుకు నిబంధనల్లో మార్పులు చేయాల్సిన పనిలేదు.

ఈ డిజిటైజేషన్‌ విధానంలో ఉభయ పక్షాల లిఖిత వాదనలు జరపాల్సిన అవసరం ఉండదు’ అని జస్టిస్‌ ఖేహర్‌ వెల్లడించారు. ఓ కేసు సుప్రీంకోర్టుకు బదిలీ అయితే.. కేసుకు సంబంధించి హైకోర్టు వద్దనున్న పెద్ద పుస్తకం సుప్రీంకోర్టుకు బదిలీ అవుతుందన్న జస్టిస్‌ ఖేహర్‌.. ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చాక కేవలం ఫైల్‌ చేస్తున్న కేసు నంబరును వేస్తే సరిపోతుందన్నారు. ప్రతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగం.. ఏ కేసులో తమను భాగస్వామిని చేశారనే విషయం తెలిసిపోతుంది. కేసులను వీలైనంత త్వరగా విచారించేందుకు వేసవి సెలవుల్లో పనిచేయాల్సిందిగా హైకోర్టు న్యాయమూర్తులను కోరినట్లు చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు