సీఎస్‌ కుమారుడి ఇంట్లో బంగారం, డబ్బు స్వాధీనం

21 Dec, 2016 18:17 IST|Sakshi
సీఎస్‌ కుమారుడి ఇంట్లో బంగారం, డబ్బు స్వాధీనం

చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావుకు ఆస్తులకు సంబంధించి ఐటీ దాడులు కొనసాగుతునే ఉన్నాయి. ఉదయం నుంచి ఆయన, బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సీఎస్‌ రామ్మోహన్‌ రావు కార్యాలయంలో కూడా సోదాలు చేస్తున్నారు. ఇక రామ్మోహనరావు కుమారుడి ఇంట్లో నుంచి రూ.18లక్షల కొత్త కరెన్సీతోపాటు రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌ రెడ్డితో సంబంధాలపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల శేఖర్‌ రెడ్డి ఇంట్లో రూ.100కోట్లకు పైగా కరెన్సీని ఐటీ అధికారులు సీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న రామ్మోహనరావు ఇంటిపై ఐటీ అధికారులు సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే.  

గత ఎన్నికల సమయంతో పాటు ఇటీవల నగదు మార్పిడి విషయాల్లో పలుమార్లు ఆయనపై ఐటీ అధికారులు కన్నేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు శశికళ, ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వంకు కూడా ఆయన సన్నిహితుడని, వీళ్ల ఆర్థిక వ్యవహారాల్లో కూడా రామ్మోహనరావు సలహాలు ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శేఖరరెడ్డి ఇంటిపై దాడి తర్వాత పలువురిపై దాడులు జరగొచ్చని సమాచారం ఉంది. కానీ ఏకంగా సీఎస్ ఇంటిపైనే దాడులు జరుగుతాయని ఎవరూ ఊహించలేకపోయారు.

మరిన్ని వార్తలు