జయ చానెల్‌కు ఐటీ ఝలక్‌..!

9 Nov, 2017 08:39 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో అనూహ్య పరిణామం.. ప్రస్తుతం జైల్లో ఉన్న అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ ఆర్థిక సామ్రాజ్యానికి ఆదాయపన్నుశాఖ (ఐటీ) దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. శశికళ, ఆమె బంధువుల ఆస్తుల లక్ష్యంగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము నుంచి 80మందికిపైగా ఐటీ అధికారులు ఏకంగా 30 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన ’జయ టీవీ’, అన్నాడీఎంకేకు చెందిన నమధు ఎంజీఆర్‌ పత్రిక కార్యాలయాల్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. జయటీవీ కార్యాలయంలో దాదాపు పదిమంది ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

టార్గెట్‌ శశికళ..
జయలలిత ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం జయటీవీ, నమధు ఎంజీఆర్‌ పత్రిక శశికళ కుటుంబసభ్యుల  అధీనంలో ఉన్నాయి. శశికళను పార్టీ నుంచి బహిష్కరించి.. ఈపీఎస్‌-ఓపీఎస్‌ శిబిరాలు విలీనమైన నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఈ సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జయటీవీ, ఎంజీఆర్‌ పత్రిక పనిచేస్తున్న నేపథ్యంలోనే వీటిపై ఐటీ దాడులు జరగడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. ముఖ్యంగా శశికళ బంధువులైన దినకరన్‌, దివాకరన్‌, శశికళ వదిన ఇళవరసి, ఆమె మేనకోడలు కృష్ణప్రియ ఇంట్లో ఐటీ దాడులు ఏకకాలంలో కొనసాగుతున్నాయి. తంజావూరులోని శశికళ భర్త నటరాజన్‌ ఇంట్లో, బెంగళూరులోని శశికళ సన్నిహితుడు పుహళేంది ఇంట్లోనూ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. జయలలిత ఆస్తులు ప్రస్తుతం శశికళ కుటుంబసభ్యుల నియంత్రణలో ఉన్నాయి. వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో శశికళ టార్గెట్‌గా ఐటీ దాడులు జరగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ఆదాయాన్ని దాచిపెట్టడం, పన్ను ఎగవేయడం వంటి సమాచారం ఆధారంగానే చానెల్‌ కార్యాలయంలో దాడులు నిర్వహించినట్టు ఐటీ అధికారులు తెలిపారు. ‘చానెల్‌ పన్ను ఎగ్గొట్టేందుకు ఆదాయ వివరాలను దాచిపెడుతున్నట్టు మాకు సమాచారం అందింది. చానెల్‌ కార్యకలాపాలు, ముఖ్య సిబ్బంది తీరుపై ప్రస్తుతం దృష్టి పెట్టాం’ అని ఐటీ అధికారులు చెప్పారు. జయ చానెల్‌తోపాటు శశికళ కుటుంబానికి చెందిన జాజ్‌ సినిమా థియేటర్‌పై, వివేక్‌ నివాసంలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు