కర్ణాటకలో ఐటీ దాడుల కలకలం

28 Mar, 2019 10:45 IST|Sakshi

బెంగళూరు : కర్ణాటకలో ఐటీ దాడులు సంచలనం రేపుతున్నాయి. ఆదాయపన్ను శాఖ అధికారులు పలువురు జేడీఎస్‌ నాయకులు, వారి అనుచరుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచే ఈ దాడులు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణ నిర్వహిస్తున్న పీడబ్ల్యూడీ శాఖలో అవినీతి జరిగిందనే ఆరోపణ నేపథ్యంలో మొత్తం 12 ప్రాంతాల్లో ఐటీ రైడ్స్‌ జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో రేవణ్ణ అనుచరుల ఇళ్లతో పాటుగా ముగ్గురు కాంట్రాక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల ఇళ్లు, ఆఫీసుల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు జేడీఎస్‌ ఎమ్మెల్సీ బీఎం ఫరూఖ్‌, మంత్రి పుత్తరాజు ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ విషయంపై స్పందించిన సీఎం కుమారస్వామి... ‘ జేడీఎస్‌, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాజకీయ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు చేయించి గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో మమ్మల్ని బెదిరించడానికి ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. ఐటీ దాడుల ద్వారా ఆయన నిజమైన సర్జికల్‌ స్ట్రైక్స్‌కు తెరతీశారు. ఆయనకు.. రాజ్యాంగం ప్రసాదించిన పదవిని అనుభవిస్తున్న ఐటీ ఆఫీసర్‌ బాలకృష్ణ సహకరిస్తున్నారు* అని ట్విటర్‌ వేదికగా ఆరోపణలు చేశారు.

కాగా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందేందుకు కొంతమంది కేంద్ర ప్రభుత్వ సంస్థలను వాడుకునే అవకాశం ఉందని కుమారస్వామి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘ రాజకీయంగా ఎదుర్కోలేకే ఒక్కోసారి ప్రత్యర్థులు అధికార దుర్వినియోగానికి పాల్పడతారు. ఐటీ శాఖ సోదాలు నిర్వహించే సమయంలో రక్షణ కోసం రాష్ట్ర పోలీసులను తమ వెంట తీసుకువస్తారు. కానీ గురువారం జరిగే దాడుల్లో సీఆర్పీఎఫ్‌ బలగాలు కూడా రంగంలోకి దిగుతాయని నాకు సమాచారం అందింది. ఇది నిజంగా కుట్రపూరితమైనది’ కుమారస్వామి విమర్శలు గుప్పించారు. అయితే ఆయన అన్నట్టుగానే గురువారం ఐటీ శాఖ దాడులు చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు