టపాసులపై నిషేధం సమంజసమేనా?

11 Oct, 2017 16:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బాణాసంచా అమ్మకాలను నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయడాన్ని త్రిపుర గవర్నర్‌ తథాగత్‌ రాయ్‌ తప్పు పట్టడంలో అర్థం ఉంది. కానీ మున్ముందు హిందువుల అంత్యక్రియలపై కూడా నిషేధం విధిస్తారేమోనన్న ఆయన వ్యాఖ్యలు అర్థరహితం. ఏ కారణంగా తాము బాణాసంచా విక్రయాలను నిషేధించాల్సి వచ్చిందో సుప్రీం కోర్టు సరిగ్గా వివరించక పోవడం పట్ల ఎక్కువ మంది విశ్లేషకులు ఆ తీర్పును విమర్శిస్తున్నారు. వాతావరణ కాలుష్యం కారణంగా వీటి అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించిన సుప్రీం కోర్టు, నిషేధం విధించాల్సినంతగా వాటి నుంచి కాలుష్యం వెలువడుతుందా? అన్న విషయాన్ని వెల్లడించలేదు. తన తీర్పును ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయడం, అదీ ఒక్క దీపావళి పండుగకు మాత్రమే పరిమితం చేయడంలో కూడా అర్థం కనిపించడం లేదు. 

దీపావళి అంటే నిజంగా దీపాల పండుగే. కాంతుల కోసమే టపాసులను కాల్చే సంస్కృతిని మనం అలవాటు చేసుకున్నాం. కానీ ఇప్పటి టపాసులు కాంతులకన్నా శబ్దాన్నే ఎక్కువ విడుదల చేస్తున్నాయి. ధడేల్‌ మనే ఆ శబ్దాలు కూడా ప్రజల కర్ణ భేరీలు పగిలే అంతా లేదా చెవుడు వచ్చే అంత ఉంటున్నాయి. టపాసులు కూడా మూడు రోజుల దీపావళి పండుగకే పరిమితం కావడం లేదు. గేణ్‌శ్‌ విసర్జన పండుగ నుంచే టాపాసులు పేలుతున్నాయి. ఏదో కారణంగా నూతన సంవత్సరం వేడుకల వరకు టపాసులు కాల్చడం కొనసాగుతోంది. 1970, 1980 దశకాల్లో బాణాసంచా కాల్చడం ఎక్కువగా ఉండేది. వాతావరణం కాలుష్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం, పాఠశాలల్లో కూడా విద్యార్థులకు వీటి కాలుష్యం గురించి చెప్పడం వల్ల ఇప్పుడు వీటిని కాల్చడం ఒక్క ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా తగ్గింది.

గతంలో ఇదే కోర్టు చైనా నుంచి బాణాసంఛా దిగుమతిని నిషేధించింది. ఆ నిషేధం ఎంత ప్రభావం చూపించింది, ఎలాంటి ప్రభావం చూపించిందన్న అంశాన్ని కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకోలేదు. బాణాసంచా పుట్టినిల్లు చైనాలో కూడా వీటిని నిషేధించాలనే ప్రతిపాదనలు పదే పదే వస్తున్నా ఇప్పటికీ నిషేధం విధించలేకపోతున్నారు. ఢిల్లీ కన్నా బీజింగ్‌ లాంటి నగరాలు అత్యధిక కాలుష్య నగరాలనే విషయం తెల్సిందే. చైనాలో 1400 సంవత్సరాల క్రితం బాణాసంచాను తయారు చేయడం కనుగొన్నారు. ఆ తర్వాత రెండు, మూడు వందల సంవత్సరాలకు భారత్‌లో వీటి తయారీ మొదలైందన్నది నిపుణుల అంచనా. బాణాసంచా వల్ల కలుగుతున్న కాలుష్యం ఎంతో తెలుసుకునేందుకు ఓ నిపుణుల కమిటీని వేయాల్సిందిగా భారత సుప్రీం కోర్టు 2016, నవంబర్‌ 11వ తేదీన కేంద్ర కాలుష్య నియంత్రణా బోర్డును ఆదేశించింది. మూడు నెలల్లో నివేదికను అందజేయాల్సిందిగా గడువు కూడా నిర్దేశించింది. అది తన డ్యూటీ కాదంటూ సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయలేదు. ‘పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌’ను నివేదికు అడగాల్సిందిగా సూచించింది.

కాలుష్యానికి సంబంధించి సమగ్ర నివేదిక లేకుండా సుప్రీం కోర్టు బాణాసంచా అమ్మకాలను ఢిల్లీ నగరంలో నిషేధించడం ఎంత మేరకు సమంజసం ? సుప్రీం కోర్టు ఉత్తర్వులను కూడా ఖాతరు చేయని కాలుష్యం నియంత్రణ బోర్డుపై కోర్టు ధిక్కారం లేదా ప్రభుత్వ విధుల పట్ల నిర్లక్ష్యం కింద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అమ్మకాల నిషేధం వల్ల ఇప్పటకే కోట్ల రూపాయల సరకును తెచ్చిపెట్టుకున్న వ్యాపారస్థులు ఏమి కావాలి? వారిలో దివాలా తీసేవారు ఉండరా? కాల్చడంపైన నిషేధం లేదు కనుక ఢిల్లీ ఇరుగు, పొరుగు ప్రాంతాల నుంచి ప్రజలు బాణాసంచాను కొనలేరా? వ్యాపారస్థులే స్మగ్లింగ్‌ చేయరా? అసలు ఢిల్లీ ఒక్కటే దేశంలో కాలుష్య నగరమా? ఉత్తరాది నగరాల్లో కాలుష్యం ఎక్కువగా లేదా? సుప్రీం కోర్టు పరిధి దేశం మొత్తానికా, ఢిల్లీ నగరానికే పరిమితమా!?

మరిన్ని వార్తలు