ఓనం వేడుకలకు ‘మినీ కేరళ’ సిద్ధం

5 Sep, 2014 23:58 IST|Sakshi
ఓనం వేడుకలకు ‘మినీ కేరళ’ సిద్ధం

న్యూఢిల్లీ: తమ స్వరాష్ట్రానికి దూరంగా ఢిల్లీలో నివసిస్తున్న కేరళవాసులను తమ సొంతవారితో కలిసి ఆనందంగా గడిపేందుకు ‘ఓనం’ పండుగ ఒక వేది కగా మారింది. మహాబలి చక్రవర్తి ఓనం రోజు తన ప్రజలను కలుసుకునేందుకు ఆత్మ రూపంలో వస్తాడని కేరళవాసుల నమ్మకం. అతడిని తమ ఇళ్లకు ఆహ్వానించడానికే ఈ పండుగను జరుపుకుంటారు.ఈ నెలలోనే అక్కడ పంటలు ఇంటికి చేరతా యి.. కాబట్టి దీన్ని పంటల పండుగగా కూడా జరుపుకుంటారు. మహాబలిని ఇంట్లోకి ఆహ్వానిం చేందుకు ఇంటిముందు అందమైన ముగ్గులు వేసి వాటి ని ఆకర్షణీయంగా తీర్చుదిద్దుతారు.

వీటిని పూగళమ్ అని అంటారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్ పరిధిలో ఉన్న పలు కేరళ అసోసియేషన్లు ఇప్పటికే ఈ ఉత్సవాల ను గత నెల 29వ తేదీ నుంచి ప్రారంభించాయి. స్థానిక కేరళీయులందరూ ప్రతిరోజూ తమ ఇళ్ల ముందు అందమైన ముగ్గులు వేసి వాటిని పువ్వుల తో అలంకరిస్తున్నారు. వాటి మధ్యలో త్రికక్కర అప్పన్‌ను ఉంచుతారని స్మిత అనే మళయాళీ తెలి పింది. జనసంస్కృతీ అనే సంస్థ అధ్యక్షుడు పి.కె.మోహన్‌దాస్ మాట్లాడుతూ.. తమ సంస్థ తరఫున ఓనమ్ (పూగళమ్ ఉత్సవాలు)ను ఆదివారం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ పండుగ సందర్భంగా పచ్చటి ఆకులో 20 రకాల వంటకాలు, పాయసంతో ‘ఓన సధ్య’ను స్వీకరిస్తామన్నారు. కేరళ హౌస్, ఇతర మళయాళీ ఆర్గనైజేషన్లు గోల్ మార్కెట్, జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం తదితర ప్రాంతాల్లో ఓనసధ్యను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. వసంత్ కుంజ్‌లో ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నిర్మల్ జ్యోతి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టులో పలు వినోద కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలను నిర్వహించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, వసంత్‌కుంజ్ మళయాళీ అసోసియేషన్, అయ్యప్ప సేవా సంఘం కూడా ఓనమ్ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి.

తిరుఓనమ్ సందర్భంగా వచ్చే ఆదివారం పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయనున్నట్లు అయ్యప్ప సేవా సంఘం కార్యదర్శి ఎం.జి.కృష్ణన్ తెలిపారు. ఆ రోజు మహిళలు సంప్రదాయ ఆఫ్‌వైట్ కాటన్ చీర, పురుషులు ఆఫ్‌వైట్ కాటన్ ధోతీలు ధరిస్తారని తెలిపారు. నగరంలో ఉన్న అన్ని మళయాళీ అసోసియేషన్లతో సం బంధాలున్న ఓంచూరీ ఎంఎం పిళ్లై మాట్లాడుతూ.. ఓనమ్ పండుగ అనేది రెండు నెలలు పాటు నడుస్తుందని తెలిపారు. ఒక్కోసారి అది ఇంకా ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. ఈ పండుగను ఢిల్లీలో స్థిరపడిన కేరళవాసులు ప్రతి ఆదివారం ఆనందంగా జరుపుకుంటారన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారన్నారు.

ఓనమ్ పండుగ కేరళ బయట ఉన్న కేరళీయులందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చే పండుగ అని కేరళ హౌస్ సభ్యులన్నారు. మళయాళ నెల అయిన చింగమ్‌లో మహాబలిని తమ ఇళ్లకు ఆహ్వానిస్తారన్నారు. ‘పూగళమ్(పూలముగ్గు) తో మా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. నేను మొదట పూగళమ్ వేసి అనంత రం సంప్రదాయబద్ధమైన చీరను ధ రిస్తా.. సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటా.. మేం మొదట నిర్ణయించుకున్నట్లు గుర్గావ్‌లో గాని, ఢిల్లీలోని గాని ఒక వేదికపై కలుసుకుంటాం..’ అని గుర్గావ్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న మిని శామ్ తెలిపింది.

ఈ పండుగ సందర్భంగా పలు రకాల నాటకాలు, డ్యాన్స్ కార్యక్రమాలు ఉంటాయి. పులి కలి లేదా కదువకళి అనే ఒక రకమైన జానపద కళ లో పులివేషం వేసుకున్న కళాకారులు మేకలను ఎలా వేటాడేది..అలాగే మానవులతో తాము ఎలా వేటాడబడేది.. అనుకరించి చూపిస్తారు. మహిళలు పోగళమ్ చుట్టూ తిరుగుతూ, మహాబలిని పాట లతో స్తుతిస్తూ సంప్రదాయ నృత్యమైన తుంబి లేదా కైకోత్తికలిని ప్రదర్శిస్తారు..’ అని జియో జాక బ్ తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 200 మంది కళాకారులతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
 
కాగా ఢిల్లీలో అఖిల భారత మళయాళీ అసోసియేషన్‌కు సంబంధించిన 26 శాఖలున్నాయి. ఓనమ్ సందర్భంగా ప్రతి శాఖ సంప్రదాయ నృత్య కార్యక్రమాన్ని ప్రదర్శిస్తుందని  పిళ్లై చెప్పారు. అలా గే సభ్యులందరి మధ్య సత్సంబంధాలను నెలకొల్పేందుకు కేరళ సంప్రదాయ క్రీడలైన కుటుకుటు, తలప్పంతుకళి, కయ్యన్‌కళి,అట్టకళమ్, విలువిద్య వంటి వాటిని కూడా నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు