ఆ మెసేజ్ నమ్మొద్దు..!

5 Feb, 2016 11:22 IST|Sakshi
ఆ మెసేజ్ నమ్మొద్దు..!

డయల్ 1098...  మెసేజ్... ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరస్ లా వ్యాపించి అందర్నీ మోసగిస్తోంది. భారత దేశంలో పేదపిల్లలకు అదనపు ఆహారాన్ని  ఛైల్డ్ లైన్ ఇండియా ద్వారా అందించేందుకు... మోదీ ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశ పెట్టిందంటూ వాట్సాప్ లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ఇదో మంచి ప్రయత్నమే కావడంతో వాట్సాప్ గ్రూపులు, వ్యక్తులు ఈ సందేశానికి విపరీతంగా ప్రాచుర్యం కల్పిస్తున్నారు. అయితే ఇది పూర్తిగా బూటకం అని, ఈ మెసేజ్ ను ఎవ్వరూ నమ్మొద్దని  ఛైల్డ్ లైన్ ఇండియా హెచ్చరిస్తోంది.

నిరుపేదలు, అన్నార్తులకు సహాయం అందించడం నిజంగా మెచ్చుకోదగ్గ కార్యక్రమం. అటువంటి కార్యక్రమాలు ఎవరు ప్రవేశ పెట్టినా దానికి ప్రచారం కల్పించడం కూడా అవసరం. అటువంటి పనులు చేసే ముందు కాస్త ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందని ఇప్పడు 'డయల్ 1098' ద్వారా తెలుస్తోంది. మనకు వచ్చిన ఏ మెసేజ్ నైనా ముందు.. వెనుకా ఆలోచించకుండా ఫార్వర్డ్ చేసేయడం అంత మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భం హెచ్చరిస్తోంది. నిజంగా ఇతరులకు సహాయం చేయాలనుకున్నవారు ఇటువంటి మెసేజ్ లు చూసినప్పుడు కాస్త లోతుగా దృష్టి పెట్టాలని సూచిస్తోంది.

గుడ్ న్యూస్ అంటూ... కొన్నాళ్ళ క్రితం నుంచీ వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్న డయల్ 1098 మెసేజ్ గురించి ఎంతోమంది ఛైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్ కు ఫోన్లు కూడా చేశారట. నిజంగా ఇటువంటి పథకం ఏమీ లేదని చెప్పడంతో ఎంతో నిరాశకు గురయ్యారట. పిల్లల హక్కులను కాపాడే ప్రముఖ ఎన్జీవో సంస్థ 1996లో ప్రారంభమైనప్పటినుంచీ వీధిబాలల (స్ట్రీట్ చిల్డ్రన్) కోసం ఓ ప్రత్యేక హెల్స్ లైన్ నెంబర్ ను  అందుబాటులోకి తెచ్చింది. ఇటువంటి మెసేస్ లు వచ్చినపుడు, కార్యక్రమాల గురించి విన్నపుడు తమకు కాల్ చేయమని సలహా ఇస్తోంది. ఇటువంటి సందేహాలపై  సలహాలను తమ వెబ్ సైట్ లో అందిస్తామని కూడా చెప్తోంది.

పార్టీ పూర్తయిన తర్వాత మిగిలిన ఆహార పదార్థాలు తీసుకుంటారా అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేయడం సంస్థ సభ్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటువంటి చైన్ లింక్ మెసేజ్ లు, మెయిల్స్ నమ్మొద్దని, 1098 కేవలం చిన్నారుల భద్రత, రక్షణ కోసం ఏర్పాటు చేసిన నెంబర్ అని సంస్థ నిర్వాహకులు వివరిస్తున్నారు. తాము ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, పంచడం వంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని, ఇది పూర్తిగా మోసపూరిత మెసేజ్ అని చెప్తున్నారు. దయచేసి ఇటువంటి సందేశాలను సర్క్యులేట్ చేయొద్దని, ఈ విషయంలో తమకు సహకరించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు