ట్రంప్‌ వెంటే ఇవాంకా..

22 Feb, 2020 03:13 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనలో ఆయన కూతురు ఇవాంకా కూడా భాగం కానున్నారు. ట్రంప్‌ సీనియర్‌ సలహాదారుల హోదాలో ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెద్‌ కుష్నర్‌ భారత్‌కు వస్తున్నారు. ట్రంప్‌తో పాటు ఉన్నత స్థాయి అధికారుల బృందం భారత పర్యటనలో పాలుపంచుకుంటోంది. ఫిబ్రవరి 24న ఫస్ట్‌ లేడీ మెలానియా తన భర్త ట్రంప్‌తో పాటు భారత్‌ వస్తున్నారని ఇప్పటికే ప్రకటించిన అమెరికా.. తాజాగా ట్రంప్‌తో పాటు వస్తున్న ఉన్నత స్థాయి అధికారుల బృందం వివరాలను ప్రకటించింది. వారిలో ఆర్థిక మంత్రి స్టీవెన్‌ నుచిన్, వాణిజ్య శాఖ మంత్రి విల్బర్‌ రాస్, విద్యుత్‌ శాఖ మంత్రి డాన్‌ బ్రౌలిటీ, జాతీయ భద్రత సలహాదారు రాబర్ట్‌ ఒబ్రీన్‌ తదితరులున్నారు.

24న తాజ్‌ మహల్‌
ఫిబ్రవరి 24న వాషింగ్టన్‌ నుంచి ట్రంప్‌ నేరుగా అహ్మదాబాద్‌ చేరుకుంటారు. అక్కడ మోదీతో కలిసి రోడ్‌ షోలో పాల్గొంటారు. అనంతరం మొతెరా క్రికెట్‌ స్టేడియంలో జరిగే ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ట్రంప్‌ కుటుంబం నేరుగా ఆగ్రా వెళ్తుంది. సూర్యాస్తమయంలోపు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. అక్కడ దాదాపు ఒక గంట పాటు గడుపుతారు. అనంతరం, ఢిల్లీ పయనమవుతారు.

25న రాజ్‌ఘాట్‌
ఫిబ్రవరి 25వ తేదీన ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి భవన్‌ వద్ద అధికారిక స్వాగతం లభిస్తుంది. అక్కడి నుంచి వారు రాజ్‌ఘాట్‌ వెళ్లి మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఆ తరువాత హైదరాబాద్‌ భవన్‌లో ట్రంప్, మోదీల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. ఉగ్రవాదంపై పోరులో సహకారం, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో పరస్పర వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడం, రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారం, హెచ్‌1బీ వీసా విషయంలో భారత్‌ ఆందోళనలు.. మొదలైనవి వారి చర్చల్లో భాగం కావచ్చని సమాచారం. అలాగే, అమెరికా నుంచి 24 ఎంహెచ్‌–60 రోమియో హెలికాప్టర్లు, 6 అపాచీ హెలీకాప్టర్లను కొనుగోలు చేయడానికి సంబంధించి ఒప్పందం కుదిరే అవకాశముంది.  

సర్వం వచ్చేసింది
ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో ఆయనకు అవసరమైన సమాచార, రక్షణ వ్యవస్థలను, ట్రంప్‌ అధికారిక హెలికాప్టర్‌ మెరైన్‌ వన్, రోడ్‌ షోలో పాలు పంచుకునేందుకు భారీ రక్షణ వ్యవస్థతో కూడిన ఎస్‌యూవీ తరహా వాహనం(డబ్ల్యూహెచ్‌సీఏ రోడ్‌రన్నర్‌. దీన్నే మొబైల్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వెహికల్‌ అంటారు).. మొదలైన వాటిని తీసుకుని మూడు సీ 17 గ్లోబ్‌మాస్టర్‌ కార్గో విమానాలు అహ్మదాబాద్‌ చేరుకున్నాయి. అమెరికా నుంచి పలువురు సుశిక్షిత భద్రత సిబ్బంది కూడా వచ్చారు.  

ఢిల్లీలో భద్రత ఏర్పాట్లు
ట్రంప్‌ కుటుంబానికి ఆతిథ్యమిచ్చే ఐటీసీ మౌర్య హోటల్‌ చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టారు. వారు ఉండే గ్రాండ్‌ ప్రెసిడెన్షియల్‌ ఫ్లోర్‌ను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. ట్రంప్‌ అందులోని చాణక్య సూట్‌లో ఉంటారని సమాచారం. గతంలో అందులో అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, జార్జిబుష్‌లు సేదతీరారు. ట్రంప్‌ బృందం వెళ్లేంతవరకు ఇతరులెవరికీ ఆ హోటల్‌లో గదులను కేటాయించరు. హోటల్‌లో ఉన్న మొత్తం 438 గదులను వారికే బుక్‌ చేశారు. కాగా, ఇరాన్‌– అమెరికాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటున్నారని, బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారని భద్రత ఏర్పాట్లలో పాలుపంచుకున్న వర్గాలు వెల్లడించాయి.   

సాదర స్వాగతం
అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి మొతెరా క్రికెట్‌ స్టేడియం వరకు.. ట్రంప్, మోదీ పాల్గొనే రోడ్‌ షో మార్గంలో 28 వేదికలను ఏర్పాటు చేస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ వెల్లడించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ వేదికలపై ప్రదర్శనలు ఉంటాయన్నారు. అయితే, కొత్తగా నిర్మించిన మొతెరా స్టేడియాన్ని ఫిబ్రవరి 24న ప్రారంభించే కార్యక్రమం ఉండబోదని గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(జీసీఏ) స్పష్టం చేసింది. కేవలం నమస్తే ట్రంప్‌ కార్యక్రమం మాత్రమే జరుగుతుందని పేర్కొంది.

సబర్మతి ఆశ్రమం సందర్శనపై సందిగ్దం
అయితే ట్రంప్‌ దంపతులు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారా? లేదా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌజ్‌ నిర్ణయం తీసుకుంటుందని గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ వెల్లడించారు.

మరిన్ని వార్తలు